వైసీపీ హయాంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరంలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు, టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని వంశీపై ఆరోపణలున్నాయి. ఆ విషయంపై అప్పట్లోనే కేసు నమోదైనా..ముందుకు సాగలేదు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కేసు విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వంశీ పీఏ రాజాతోపాటు 11 మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న రాజా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్న రాజాను మాటు వేసి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే వంశీకి కూడా ఉచ్చు బిగుస్తోందని టాక్ వస్తోంది. వంశీపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి వంశీనే ప్రేరేపించారని పుకార్లు ఉన్నాయి. తాజాగా విచారణలో రాజా ఇచ్చే సమాచారం ఆధారంగా వంశీపై కూడా కేసు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఏది ఏమైనా వంశీ పీఏ రాజా అరెస్టుతో గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా గరంగరంగా మారాయి. పోలీసుల చేతికి వల్లభనేని వంశీ జుట్టు చిక్కినట్లేనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.