ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? ఒకింత జాగ్రత్తగా చూడండి..! గుర్తుకువచ్చారా? ఎస్! నిన్న మొన్నటి వరకు భారీ ఎత్తున హంగామాతో.. భారీ మందీ మార్బలంతో.. ముందు వెనుక పోలీసు బందోబస్తుతో తిరిగిన ఏపీ ఉప ముఖ్యమంత్రి.. పుష్ప శ్రీవాణి! ఇప్పుడేంటి ఇలా మారిపోయిందీవిడ! అని అనుకుంటున్నారా? అదే.. ఇటీవల మంత్రి వర్గం నుంచి పక్కన పెట్టారు కదా!! బహుశ అందుకే.. సొంత వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించుకుంటున్నారట. తాజాగా ఓ ఇక్కడకు కొందరు మీడియా మిత్రులను ఆహ్వానించి.. తాను సొంతగా ఎలాంటి రసాయనాలు లేకుండా.. చేస్తున్న వ్యవసాయాన్ని(అంత పెద్దగా కాదనుకోండి) పరిచయం చేశారు.
ఈ సందర్భంగా తన వ్యవసాయ క్షేత్రంలో పండిన కాలుష్యరహిత టమాటాలను కోసి.. బుట్టలో వేసుకుని.. ఇలా ఫొటోకు ఫోజిచ్చా రు.. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఆమె.. కొంత మనసులో మాట పంచుకున్నారు. తనకు వ్యవసాయం అంటే ఇష్టమని.. అందుకే.. ఇంటినే సాగు భూమిగా మార్చుకుని.. పలురకాల కూరగాయలు పండిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు.. తాను పండిస్తున్న పంటలను తన కుటుంబంతోపాటు.. ఇరుగు పొరుగు వారికి కూడా ఉచితంగానే పంచిపెడుతున్నానని చెప్పుకొచ్చారు. ఒకసారి ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి కూడా పలు రకాల పండ్లను, కూరలను కూడా పంపించినట్టు ఈ సందర్భంగా ఆమె మురిపెంగా చెప్పుకొచ్చారు.
వైఎస్ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రురాలిగా పేరున్న పుష్ప శ్రీవాణి.. చేతిపై వైఎస్ పేరును కూడా పచ్చబొట్టుగా వేయించుకున్నారు. తొలుత కాంగ్రెస్.. తర్వాత వైసీపీలో చేరిన పుష్ప శ్రీవాణి.. 2014, 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లా కురుపాం.. ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌పై వరుస విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే గత కేబినెట్‌లో గిరిజన శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా కూడా జగన్ అవకాశం కల్పించారు. అయితే.. ఆమె కుల వివాదంలో చిక్కుకుని.. చాలా ఇబ్బందిపడిన విషయం రాజకీయాల్లో చర్చకు వచ్చింది. అయితే.. ప్రస్తుతం ఈ కేసు కొట్టేసినట్టు సమాచారం.
ఇదిలావుంటే.. తాజాగా జరిగిన మంత్రి వర్గ ప్రక్షాళనతో జగన్ పుష్పశ్రీవాణిని పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇదే జిల్లా నుంచి ఎస్టీ కోటాలో రాజన్నదొరను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. దీంతో పుష్ప శ్రీవాణి ఫ్రీ అయ్యారు. దీంతో వ్యవసాయం చేసుకుంటున్నట్టు చెప్పారు. అయితే.. జనాలు మాత్రం నిన్నమొన్నటి వరకు మంత్రి అంటూ.. తమకు దూరంగా ఉన్నారని.. ఇప్పుడు కూడా తమ సమస్యలు పట్టించుకోరా? అని నిలదీస్తున్నారు. అంతేకాదు.. సాగు చేసుకునే ఇష్టం ఉంటే.. వచ్చే ఎన్నికల్లో వేరేవారిని చూసుకుంటామని.. వ్యాఖ్యానిస్తున్నారు.
“మీ ఇష్టాన్ని మేం కాదనం మేడం. వచ్చే ఎన్నికల్లో మా ఇష్టం చూసేవారిని ఎన్నుకుంటాం!“ అని ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్య జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. నిజమే. మూడేళ్లు గడిచిపోయినా.. ఇప్పటి వరకు నియోజకవర్గంలో అసలు కనిపించలేదు.. పుష్పశ్రీవాణి. కొన్ని రోజులు కరోనా.. తర్వాత.. ప్రసవం.. అంటూ.. ఆమె ఇంటికే(వైజాగ్-హైదరాబాద్) పరిమితమయ్యారు. దీంతో ఇప్పుడు ప్రజలు కనీసం.. పట్టించుకుంటారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఇలా.. చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.