సీఎం జగన్ పాలనలో వైసీపీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు మొదలుకొని ఆఖరికి మీడియా ప్రతినిధుల వరకు ఎవరైతే మాకేంటి అనే రీతిలో వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. అయినా సరే అధికార పార్టీ నేతలకు చీమ కుట్టినట్లయినా లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా ప్రతినిధిపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చిందులు తొక్కిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
భీమిలి పరిధిలోని పద్మనాభం మండలం కోరాడలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా అవంతి అనవసర రాద్ధాంతానికి కారణమయ్యారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో హాజరైన అవంతి…మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు, పోలీసు సిబ్బందిపైనా మాజీ అమాత్యులు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన టీవీ5 ప్రతినిధిని ఆయన బెదిరించారు.
నీ సంగతి చూస్తానంటూ వేలు చూపించి మరీ టీవీ5 ప్రతినిధిని అవంతి బెదిరించారు. అంతటితో ఆగని అవంతి….డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని పట్టుకుని ఏం పని చేస్తున్నావయ్యా అంటూ వీరావేశంతో ఊగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, అవంతితోపాటు అధికార పార్టీ నేతల ఆగడాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
రోజు రోజుకూ వైసీపీ నేతల బెదిరింపులు దాష్టీకాలు ఎక్కువవుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో భోజనం అయిపోయిందన్న పాపానికి ఓ హోటల్ లో ఫర్నిచర్ ను స్థానిక కౌన్సిలర్ ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే అవంతి వీరంగం ఘటన జరిగిందంటూ ట్రోల్ చేస్తున్నారు. కౌన్సిలర్ మొదలు మాజీ మంత్రి వరకు అందరూ ఇలా బెదిరింపులకు పాల్పడడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీవీ5, ఈనాడు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ లను సాక్ష్యాత్తూ జగన్ టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన దారిలోనే ఆ పార్టీ నేతలు కూడా వెళుతున్నారని ట్రోల్ చేస్తున్నారు.