నెల్లూరు వైసీపీలో లకులకలు పార్టీకి చేటు కలిగించేలా ఉన్నాయని టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. నెల్లూరు వైసీపీలోని కీలక నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ప్రవర్తిస్తున్న వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. తనకు మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక, తన నియోజకవర్గానికి సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నానని వైసీపీ సీనియర్ నేత ఆనం పలుమార్లు మీడియా ముందు బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్ళగక్కారు.
వయసు రీత్యా మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆ కుటుంబం కాస్త సైలెంట్ అయింది. నెల్లూరు వైసీపీలో మాజీ మంత్రి వర్సెస్ తాజా మంత్రిల మధ్య అంతర్గత విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వైసిపి నేత అనిల్ కుమార్ యాదవ్ తాజా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం జరుగుతోంది.
తనను మంత్రి పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో కాకానిని కూర్చోబెట్టడంపై అనిల్ కుమార్ యాదవ్ గుర్రుగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరు వైసీపీలోని ఒక నేతపై అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్లు చేశారు. పార్టీలోని ఒక సిగ్గుమాలిన నేత తనపై కుట్ర పన్నుతున్నారని, తనకు వెన్నుపోటు పొడిచేందుకు చూస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కొందరు టీడీపీ నాయకులు టచ్ లో ఉన్నారని, వారు డబ్బులు తీసుకొని మరీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. వైసీపీలోని ఒక ఎమ్మెల్యే ఈ సిగ్గుమాలిన పని చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ వివరాలన్నీ తన దగ్గర ఉన్నాయని సమయం వచ్చినప్పుడు వారి గుట్టురట్టు చేస్తానని అనిల్ కుమార్ హెచ్చరించారు.
అయితే, అనిల్ కుమార్ చెప్పిన నేత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయి ఉంటారని లేదంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది. ఏది ఏమైనా నెల్లూరు వైసీపీలో ఈ లుకలుకలు రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments 1