ఏపీలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. చిత్తూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో హింస చెలరేగింది. వైసీపీ నేతలు.. టీడీపీ నేతలపైనా.. టీడీపీ నేతలువైసీపీ నేతలపైనా దాడులు చేసుకున్నారు. చిత్తూరులో అయితే.. పుంగనూరు టీడీపీ అభ్యర్థి పులివర్తి రామచంద్రారెడ్డి ఉరఫ్ నానీపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయనపై దాడి కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇక, పల్నాడులో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పలువురు టీడీపీ నేతలను కూడా కొట్టారు.
అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి ఇంకా రణరంగంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. ఆయా ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. పలువురు అదికారులను కూడా సహకరించారంటూ.. చర్యలకు సిఫారసు చేసింది. ఇక, వైసీపీ ఎమ్మెల్యేలు, కీలకనేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. అయినప్పటికీ.. పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. ఇదిలావుంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గుప్తాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. దీనికి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కూడా తేల్చి చెప్పింది.
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దీనిపై మాజీ డీజీపీ(ఉమ్మడి రాష్ట్రంలో) దినేష్‌రెడ్డి స్పందించారు. ఇది ఒక అనూహ్యమైన అంశంగా పేర్కొన్నారు. ఈ ఊహించని పరిణామాలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఆయా ప్రాంతాల్లో హింసను అంచనా వేయడంలో విఫలమయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఆయా ప్రాంతాలు అట్టడుకుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించి.. హింసను అదుపు చేయాలని.. కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇదేసమయంలో ఎన్నికల నిర్వహణలో తెలంగాణ డీజీపీ సేవలు అత్యుత్తమంగా ఉన్నాయని ఆయన కితాబునిచ్చారు.