కోమాలో ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీకి మాజీముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డే దిక్కయ్యేట్లున్నారు. నల్లారి మాత్రమే పార్టీని పునరుజ్జీవింపచేయగలరని పార్టీ అధిష్ఠానం భావిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి పిలుపుమేరకు నల్లారి అర్జంటుగా ఢిల్లీకి చేరుకున్నారు. మూడురోజులు ఢిల్లీలోనే ఉండబోయే కిరణ్ పార్టీ అధినేత్రితో పాటు రాహుల్, ప్రియాంక గాంధితో కూడా భేటీ అవబోతున్నట్లు సమాచారం.
నిజానికి పార్టీ పగ్గాలు తీసుకోమని పార్టీ అధిష్ఠానం నల్లారిని చాలాకాలంగా కోరుతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఏ కారణం వల్లో నల్లారి ముందుకు రావటంలేదు. అందుకనే ఒకసారి రఘువీరారెడ్డి తర్వాత సాకే శైలజానాధ్ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నారు. సాకే పదవీకాలం పూర్తయిపోవచ్చింది. అందుకనే మళ్ళీ నల్లారికి ఆ బాధ్యతలను అప్పగించే ఉద్దేశ్యంతోనే అధిష్ఠానం పిలిపించినట్లు తెలుస్తోంది.
ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చేయటంద్వారా అధిష్ఠానం తనంతట తానుగా గొయ్యితవ్వి ఏపీలో పార్టీని కప్పెట్టేసింది. పచ్చగా కళకళలాడుతున్న పార్టీని చేజేతులారా నాశనం చేసేసుకుంది. పోనీ చేసిన విభజనైనా శాస్త్రీయంగా జరిగిందా ? రెండురాష్ట్రాలు లాభపడేట్లుగా చేసిందా అంటే అదీలేదు. చేసిన అడ్డుగోలు విభజన కారణంగా ఆస్తులు, నిధులు, కేంద్రసంస్ధలు, యావత్ అభివృద్ధంతా తెలంగాణాకు వెళిపోయింది. అప్పులు, లోటు బడ్జెట్ లాంటివన్నీ ఏపికి వచ్చాయి.
దాంతో జనాలకు మండిపోయి కాంగ్రెస్ కు ఘోరీ కట్టేశారు. కాబట్టి ఇలాంటి పార్టీకి నల్లారి కాదుకదా స్వయంగా సోనియా లేదా రాహులే వచ్చి బాధ్యతలు తీసుకున్నా పార్టీ లేచి నిలబడేదిలేదు. కోమాలో ఉన్న కాంగ్రెస్ బయటకు రావాలంటే ఇంకా చాలాకాలం పడుతుంది. పైగా తన నియోజకవర్గంలో కూడా గట్టిపట్టులేని నల్లారి లాంటి నేతకు పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉందంటేనే పార్టీ పరిస్ధితి ఎంత దరిద్రంగా ఉందో అర్ధమవుతోంది. మెజారిటి జనాల మనోభావాలను పట్టించుకోకుండా, అత్యంత బలహీన వ్యక్తిలాంటి కిరణ్ లాంటి వ్యక్తిని సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటిలో కోలుకునేది అనుమానమే.