వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించి.. అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును సోషల్ మీడియాలో కామెంట్లు చేశారన్న కారణంగా కస్టడీలో హింసించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ ఐపీఎస్‌పై ఏపీ ప్రభుత్వం మరోసారి సీరియస్ అయింది. తాజాగా సునీల్ కుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. తనపై అప్పటి ఎంపీ రఘురామ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. తనకు ఆ ఫిర్యాదుతో సంబంధం లేదని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు.
రఘురామ కేసులో తన ప్రమేయం లేదని, తాను హింసిచినట్టు చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తవమని.. తనపై ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానని సోషల్ మీడియాలో సునీల్‌కుమార్ పేర్కొన్నారు. అయితే.. ఐపీఎస్ అదికారులు ఎవరూ సోషల్ మీడియాలో కానీ.. సాధారణ మీడియా ముందు కానీ.. స్పందించే ముందు సంబంధిత ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను సునీల్ కుమార్ ఉల్లంఘించారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై సీరియస్ అయింది.
సోషల్ మీడియాలో ఐపీఎస్ సునీల్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ప్రభుత్వం 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. అంతేకాదు.. నిబంధనల మేరకు వివరణ లేకుంటే.. ఉన్నతాధికారులు సంతృప్తి చెందకుంటే.. ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీ ద్వారకా తిరుమల రావును ఉద్దేశించి ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో డీజీపీ తిరుమల రావు.. సునీల్ కుమార్‌కు మెమో పంపించారు. చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని దానిలో పేర్కొన్నారు. కాగా, కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. సునీల్ సహా పలువురు వివాదాస్పద ఐపీఎస్‌లను విధులకు దూరంగా ఉంచారు.
అయితే.. సునీల్‌ను గత నెలలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు తిరిగి విధుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతలోనే ఆయన తనపై గుంటూరు జిల్లా పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదుపై స్పందించారు. ఈ ఫిర్యాదును రఘురామ ఇచ్చిన విషయం తెలిసిందే. తనపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారని.. పేర్కొంటూ.. అప్పటి గుంటూరు డీఎస్పీ.. విజయపాల్ సహా సునీల్‌కుమార్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పైనా ఆయన ఫిర్యాదు చేశారు. దీనిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.