వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో గతంలో ఏపీ సీబీసీఐడీ ఏడీజీగా పనిచేసిన సునీల్‌కుమార్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. రఘురామ ఫోన్ ను సునీల్ కుమార్ తీసుకున్నారని, అందులోనుంచి వేరే వ్యక్తులకు మెసేజ్ లు పంపించారని రఘురామ ఆరోపిస్తూ ఫిర్యాదు కూడా చేశారు. దీంతోపాటు, హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో రఘురామ గతంలోనే ఫిర్యాదు చేశారు.
సునీల్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు ఆర్ఆర్ఆర్ గతంలో లేఖ రాశారు. ఈ క్రమంలోనే సునీల్‌కుమార్‌పై హోంశాఖ నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శికి రఘురామ ఇచ్చిన ఫిర్యాదును జత చేస్తూ జితేంద్ర సింగ్ చాలా నెలల క్రితం లేఖ రాశారు.
రఘురామతోపాటు సునీల్ పై కేంద్ర హోంశాఖకు ఎల్ఆర్వో కన్వీనర్ (Legal Rights Observatory Convenor) వినయ్ జోషి గతంలోనే ఫిర్యాదు చేశారు.
‘అంబేడ్కర్ ఇండియా మిషన్ పేరు’తో సునీల్ ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పోలీసు సర్వీసు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. కుల, మత విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ సునీల్ ప్రసంగాల వీడియో లింకులు జతపరిచారు. కానీ, సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా హిందూ మత వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌పై హోం శాఖ ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ నేపథ్యంలోనే గతంలో ఏపీ సిఐడి చీఫ్ గా వ్యవహరించిన డీజీ సునీల్ కుమార్ పై డీవోపీటీ సంచలన నిర్ణయం తీసుకుంది. సునీల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సిఎస్ కు డిఓపిటి లేఖ రాసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సునీల్ పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ప్రకారం ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ రాసిన లేఖ ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతోంది. ఈ లేఖపై ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.