అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సిఐడి అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి సిట్ కార్యాలయంలో లోకేష్ విచారణ జరుగుతుండగానే జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. లోకేష్ ను విచారణ జరుపుతున్న దర్యాప్తు అధికారిని హఠాత్తుగా మార్చడం చర్చనీయాంశమైంది. దర్యాప్తు అధికారి ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డిఎస్పీ విజయభాస్కర్ కు బాధ్యతలను అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ప్రకారం విచారణ అధికారిని మారుస్తున్నామని విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. జయరామరాజుకు పని భారం ఎక్కువ కావడంతోనే మార్చాల్సి వచ్చిందని ఆ పిటిషన్ లో సీఐడీ పేర్కొంది. ఇక, విచారణ సందర్భంగా లోకేష్ ను లింగమనేని రమేష్ గురించి ప్రశ్నించారని తెలుస్తోంది. హెరిటేజ్ సంస్థ భూ కొనుగోళ్లు లోకేష్ ఆధ్వర్యంలోనే జరిగాయని అడిగినట్లు తెలుస్తోంది. ఎకరం 8 లక్షలకు కొన్నారని, హెరిటేజ్ మీటింగ్ కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో లోకేష్ హాజరయ్యారని సీఐడీ అధికారులు ప్రశ్నించారట.