ఫలానా వన్డే మ్యాచ్ లో 498 పరుగులు స్కోరయ్యాయట…ఈ మాట వినగానే క్రికెట్ గురించి తెలిసిన ఏ ఒక్కరైన రెండు ఇన్నింగ్స్ లలో కలిపి చేసిన స్కోరు అనుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు. కానీ, ఒక్క ఇన్నింగ్స్ లోనే ఒక జట్టు ఈ స్కోరు చేసింది అని చెబితే మాత్రం…ఔనా…అని అవాక్కవ్వని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. ఎందుకంటే, అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంతటి భారీ స్కోరు ఇప్పటి దాకా నమోదు కాలేదు. అనితర సాధ్యమైన ఈ భారీ స్కోరును సుసాధ్యం అని నిరూపించింది ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో స్కోర్ బోర్డుపై తొలి పరుగు నమోదు కాగానే తొలి వికెట్ పడితే ఏ జట్టయినా సరే కాస్త ఆచితూచి ఆడుతుంది. కనీసం మరో రెండు మూడు ఓవర్ల పాటు భారీ షాట్లు కొట్టకుండా డిఫెన్స్ లో ఉంటుంది. కానీ, క్రికెక్ కు పుట్టిల్లైన ఇంగ్లండ్ లో పుట్టి పెరిగిన ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ మాత్రం…ఎటాకింగ్ గేమ్ తో ఆతిథ్య నెదర్లాండ్స్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా పర్యాటక జట్టు ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి ఏకంగా 498 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
ఓపెనర్ జేసన్ రాయ్ ఒక పరుగుకే వెనుదిరగగా…మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ సహా డేవిడ్ మలన్, జాస్ బట్లర్ లు సెంచరీలతో చెలరేగిపోవడంతో నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఫిలిప్ సాల్ట్ (122; 93 బంతుల్లో 14×4, 3×6), డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9×4, 3×6), జోస్ బట్లర్ (162 నాటౌట్; 70 బంతుల్లో 7×4, 14×6) ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివర్లో లివింగ్ స్టోన్ (66 నాటౌట్; 22 బంతుల్లో 6×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఇంగ్లండ్ స్కోరు 500 మార్కుకు దగ్గరగా వచ్చింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు మొత్తం 26 సిక్సర్లు, 36 బౌండరీలు బాదారంటే నెదర్లాండ్స్ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
మలన్, సాల్ట్ రెండో వికెట్‌కు 170 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం అందించగా….ఆ తర్వాత ఐపీఎల్ లో సూపర్ ఫాం కంటిన్యూ చేసిన బట్లర్, మలన్ తో కలిసి మూడో వికెట్‌కు 90 బంతుల్లో 184 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక, ఐదో వికెట్‌కు బట్లర్, లివింగ్‌స్టోన్ కలిసి 32 బంతుల్లో 91 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు ఫినిషింగ్ టచ్ అందించారు. ఇంగ్లండ్ జట్టు 14.1 ఓవర్లకు 100; 27.4 ఓవర్లకు 200; 37.6 ఓవర్లకు 300; 43.5 ఓవర్లకు 400; 50 ఓవర్లకు 498 కొట్టింది.