ఏపీలో నిన్న మొన్నటి వరకు తీవ్ర వివాదంగా ఉన్న ఓటర్ల జాబితా వ్యవహారంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తనదైన శైలిలో ముగింపు ఇచ్చింది. ఓటర్ల జాబితాల్లో దొంగ ఓట్లు చేర్చారని, ఒకే ఇంటి నుంచి లెక్కలేనన్ని ఓట్లు చేరాయని, మృతులను కూడా ఓటర్ల జాబితాలో పేర్కొన్నారని.. ప్రధాన ప్రతి పక్షం టీడీపీ సహా బీజేపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో అవకతవకలు భారీగా ఉన్నాయని తెలిపాయి. అదేసమయంలో పుంగనూరు, పలమనేరు వంటి కీలక నియోజకవర్గాలపైనా ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా అందాయి.
వీటిని పరిశీలిస్తామని, లెక్క తేలుస్తామని చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. మొత్తంగా ఏం చేసిందో ఏమో కానీ.. తాజాగా ఏపీలో ఓటర్ల జాబితాపై తుది జాబితా వెల్లడించింది. ఏపీలో మొత్తం 4 కోట్ల, 8 లక్షల, 7 వేల 256 మంది ఓటర్లు ఉన్నారని తేల్చేసింది. వాస్తవానికి తుది జాబితాకు ముందు అంటే.. గతంలో వెల్లడించిన లెక్క ప్రకారం.. 4 కోట్ల, 10 లక్షల, 6 వేల 336 ఓట్లు ఉన్నాయి. అంటే.. ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో తీసేసినవి కేవలం 2 లక్షల ఓట్లు మాత్రమే.. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం దాదాపు 4 నుంచి 5 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ విషయాలపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశాయి.
కానీ, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం లెక్క తేల్చేస్తూ.. తాజాగా తుది ఓటరు జాబితాను విడుదల చేసేసింది. ఇక, దీనిలో ఎలాంటి మార్పులూ ఉండే అవకాశం లేదని కూడా తేల్చేసింది. ఈ లెక్క ప్రకారం మొత్తం ఓటర్లు 4 కోట్ల, 8 లక్షల, 7 వేల 256 మంది ఉండగా, వీరిలో మహిళలు.. 2 కోట్ల 7 లక్షల 37 వేల 65 ఉన్నారు. ఇక, పురుషుల ఓట్లు 2 కోట్ల 9 వేల 275. అంటే.. పురుషుల కన్నా మహిళా ఓటు బ్యాంకు ఏకంగా 7 లక్షల 27వేల 790 మంది ఎక్కువగా ఉన్నారు. వీరే ఎన్నికలను శాసించనున్నారనేది స్పస్టంగా తెలుస్తోంది.
ఇక, ఎన్నికల ఓట్ల జాబితాలో ట్రాన్స్ జెండర్లు 3482 మంది ఉండగా, సర్వీసు ఓటర్లు 67 వేల 434 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే.. మహిళా ఓటు బ్యాంకు మరోసారి ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇదిలావుంటే, ఎన్నికల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని.. ఇప్పటికే టీడీపీ అనేక పథకాలు ప్రకటించింది. మరోవైపు వైసీపీ కూడా ఇదే పంథాలో ఉంది. దీంతో మహిళా ఓటు ఎవరికి మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారింది.