హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు ఈ మధ్యకాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ తో దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తనతో కౌశిక్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. అయితే, ఈ సారి ఆ ప్రవర్తన కారణంగా కౌశిక్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. కౌశిక్ రెడ్డిపై జనం టమాటాలు, కోడి గుడ్లు విసరిన వైనం షాకింగ్ గా మారింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను స్థానిక మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణి చదివి వినిపించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో, అదే సభకు హాజరైన కౌశిక్ రెడ్డి…ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో, కౌశిక్ రెడ్డి తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లబ్దిదారుల పేర్లను చదవకుండా అడ్డుకొని సభలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో, కౌశిక్ రెడ్డికి రక్షణ కల్పించిన ఆయన భద్రతా సిబ్బంది…గ్రామస్థులపై కుర్చీలతో దాడి చేసి కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే గ్రామసభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి పంపించివేసి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం గ్రామ సభ కొనసాగింది.