హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. పోలింగ్ కు ముందు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అది కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలను తరలించారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కరీంనగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మనుషులు ఈవీఎంలను ఈవీఎంలు తరలిస్తున్నట్లు పేర్కొంటున్న కారుతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడయో వైరల్ అయింది.
అయితే, వీవీ ప్యాట్ లను తరలిస్తుంటే వాటిని ఈవీఎంలు అనుకొని పొరపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలింగ్ సమయంలో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని ఈటల అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చరిత్రను తిరగరాశారని, డబ్బులతో ఓట్లు కొనాలన్న కేసీఆర్ కుట్రను భగ్నం చేశారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ వ్యవహరించిందని, ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారని ఆరోపించారు. బస్సులలో ఈవీఎంల ను కూడా తరలించినట్లు వార్తలు వస్తున్నాయని, ఈవీఎంలు చెడిపోయాయని మార్చడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని ఈటల ఆరోపించారు. హుజూరాబాద్‌లో తనను ఓడించడానికి కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, కానీ, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. సీపీకి,కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని తెలిపారు. కాగా, నిన్న జరిగిన ఎన్నికలో రికార్డు స్థాయిలో 86శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం గెలుపెవరిదన్న అంశంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు, ఈటలదే గెలుపంటూ పలు సర్వేలు చెబుతుండడంతో టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు.