ఈనాడు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉండటం.. అది కూడా ప్రధాన మీడియా సంస్థల్లో పని చేస్తున్న నేపథ్యంలో.. అక్కడి వారి నుంచి అందుతున్న సమాచారంతో మాత్రమే ఈ విషయాల్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాం. నిజానికి ఇదో ఆఫ్ ద రికార్డు. అధికారికంగా చెప్పలేం. కానీ.. ఇలా జరిగిందన్న విషయాన్ని చెప్పుకునే వీలుంది.
దీనికి సాక్ష్యాలు చూపించలేం. కానీ.. ఈనాడులోని ఉన్నత స్థాయిలో ఉన్న ఏ పాత్రికేయుడ్ని అడిగినా ఇందులో నిజమెంత? అన్నది చెప్పేస్తారు. నిజానికి ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ.. చారిత్రక విజయాన్ని తెలుగుదేశం కూటమి నమోదు చేసిన వేళ.. ఇది ఇలా జరుగుతుందని అంచనా వేసిన ప్రధాన మీడియా సంస్థల్లో ఏకైక సంస్థ ఈనాడు. ఈ కారణంతోనే దీన్ని ఇప్పుడు షేర్ చేయాల్సి వచ్చింది.
ఎన్నికల వేళలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు సాధించే వీలుందన్న అంశంపై ప్రతి మీడియా సంస్థ తనకున్న పాత్రికేయులతో.. మరీ ముఖ్యంగా రిపోర్టర్ల చేత సర్వే చేయించటం మామూలే. ఇలా చేసిన సర్వేను తమ అంతర్గత సమాచారం కోసం.. ప్రజల మనసుల్లో ఏముందన్న విషయంపై అవగాహన పెంచుకోవటానికే వినియోగిస్తారు. అంతే తప్పించి.. ఇలాంటి వాటిని బయటపెట్టని తీరు చాలా ప్రధాన మీడియా సంస్థలు చేస్తుంటాయి. ఈనాడు కూడా అందుకు మినహాయింపు కాదు.
నిజానికి ఈనాడులో పని చేసిన వారికి.. ఈనాడులో పని చేస్తున్న వారికి.. ఆ సంస్థలో పాత్రికేయుడిగా పని చేసిన అనుభవం వారందరికి తెలిసిన సుపరిచితమైన అంశం.. ఆ సంస్థ రిపోర్టర్లు చేసే ఎన్నికల సర్వేను అస్సలు విశ్వసించకూడదని. దీనికి కారణం.. ఆ సంస్థలోని మిడిల్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన కొందరు చేసే అతి కారణంగా.. గ్రౌండ్ లో ఏం ఉందన్న విషయాన్ని నేరుగా చెప్పే సాహసం కిందిస్థాయి రిపోర్టర్లు చేయరు. మిగిలిన ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. తాజాగా జరిగి ఎన్నికల సందర్భంగా మేనేజ్ మెంట్ సీరియస్ గా సర్వే నిర్వహించింది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమకు ఎప్పుడూ ఎదురుకాని ఎన్నో అనుభవాల్ని ఫేస్ చేసిన నేపథ్యంలో.. తాజా ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవటానికి భారీ ఎత్తునసర్వే నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఏపీలో ఎన్నికల హడావుడి షురూ అయిన తర్వాత నిర్వహించారు. ఎప్పటిలా కాకుండా.. ఈసారి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి..గ్రౌండ్ లెవల్ లో తిరిగే రిపోర్టర్లు ఏం చెబుతారో.. దాన్నే నమోదు చేసి.. వారు చెప్పింది చెప్పినట్లుగా ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా సమాచారం ఇవ్వాలన్న ఆర్డర్ వెలువడినట్లుగా చెబుతారు.
దీంతో.. గతానికి భిన్నంగా మేనేజ్ మెంట్ చెప్పిన రీతిలో సీరియస్ గా సర్వేను నిర్వహించారు. పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇచ్చారు.రిపోర్టర్లు చెప్పిన అభిప్రాయానికి.. సమాచారానికి మిడిల్ మేనేజ్ మెంట్ లోని వారు ఎవరు జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ దశల్లో నిర్వహించిన సర్వే ఫలితాల్ని.. ఒకటికి నాలుగుసార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫలితం చూసి నోరెళ్లబెట్టినట్లుగా చెబుతారు.
కారణం.. తెలుగుదేశం కూటమికి ఖాయంగా 161 స్థానాల్ని గెలుచుకుంటుందని తేల్చారు. ఈ ఫలితాన్ని చూసిన ఈనాడు అగ్ర నాయకత్వం సైతం షాక్ తింది. వెంటనే అలెర్టు అయి.. కిందిస్థాయి రిపోర్టర్లతో పాటు.. మిగిలిన ఎడిటోరియల్ టీంను పరుగులు తీయించింది. ఇలాంటి ఫలితం ఎలా సాధ్యమవుతుంది? ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్నప్పుడు.. ఇంత భారీ విజయం సాధ్యం కాదని నమ్మంది.
మళ్లీ చేయించిన సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కాకుంటే.. అగ్రనాయకత్వం ఆగ్రహానికి గురి కాకూడదన్న ఉద్దేశంతో 161 సీట్ల ఫలితాన్ని.. 142కు తగ్గించి.. సర్వే రిపోర్టును మేనేజ్ మెంట్ కు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. రామోజీ సైతం 142 సీట్లు కూటమికి వస్తాయన్న విషయాన్ని నమ్మలేదని.. కాకుంటే ప్రత్యేక పరిస్థితుల్లో చేసిన సర్వే.. దాని కోసం పడిన ప్రయాసతో కూటమి గెలుపు ధీమాతో ఉన్నట్లు చెబుతారు.
ఈనాడు చేపట్టిన అంతర్గత సర్వే.. దాని ఫలితాలకు సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. మీడియావర్గాల్లో కామెడీ చేసుకున్నారు. కూటమికి 161సీట్లా? అంటూ ఆశ్చర్యపోవటం.. అంతలోనే కామెడీ చేసుకోవటం.. మనోళ్లు సర్వే చేస్తే ఆ మాత్రం రాకుండా ఎందుకు ఉంటుంది? అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. మంగళవారం మధ్యాహ్నానానికి స్పష్టమైన సంచలన గెలుపు వేళలోనూ ఏదో ఒక సందేహం. ఎప్పుడైతే సాయంత్రం ఐదు గంటలకు 160 సీట్లు దాటటం ఖాయమని తేలిందో.. అప్పుడు కానీ తమ వారు ఇచ్చిన సర్వే రిపోర్టు గుర్తుకు వచ్చింది.
అంతేకాదు.. మీడియా వర్గాల్లోని పలువురు తాము కామెడీ చేసిన ఈనాడు సర్వే అక్షర సత్యంగా మారటంతో.. ఈనాడులో పని చేసే వారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి.. మీవాళ్లు పక్కాగా చేసిన సర్వేను మేం నమ్మలేదు. కానీ.. మీ వాళ్లు ఏపీ ఓటర్ల నాడిని సరిగ్గా పట్టుకున్నారంటూ అభినందిస్తున్న పరిస్థితి. మొత్తంగా కూటమి చారిత్రక గెలుపును అంచనా వేసింది ఈనాడులో పని చేసే కింది స్థాయి రిపోర్టర్లుగా చెప్పక తప్పదు. వారి కష్టాన్ని చరిత్రలో రికార్డు చేయాల్సిన అవసరం ఉందన్న భావనతోనే దీన్ని రాయటం జరిగిందే తప్పించి.. మరెలాంటి కారణం లేదు.