తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు, కుటుంబసభ్యుల ఇళ్లు, ఆఫీసులు, కాలేజీలపై ఐటీ సోదాల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డితో పాటు 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి వచ్చే సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఐటీ అధికారుల సోదాల్లో రూ.18.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
మల్లారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఐటీ అధికారుల ల్యాప్ టాప్ ను మల్లారెడ్డి అనుచరులు లాక్కోవడం, ఐటీ అధికారులపై దాడి ఘటనలను ఐటీ శాఖ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నిర్వహించిన సోదాలపై పూర్తి వివరాలతో ఈడీకి లేఖ రాయనున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీ అవకతవకలపై పూర్తి వివరాలు తెలియాలంటే ఈడీ విచారణ జరగాలని ఐటీ భావిస్తున్నట్లుగా సమాచారం.
ఒకవేళ ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగితే మల్లారెడ్డికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్టేనని అనుకుంటుున్నారు. మరోవైపు ఐటీ సోదాలపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే తనపై దాడులు చేశారని, తాను ఆ పార్టీ మంత్రిని కాబట్టే ఢిల్లీ పెద్దలు రాజకీయ కక్షతో ఈ సోదాలు చేయించాని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, సీఎం కేసీఆరే తన ధైర్యం అని చెప్పారు.