టాలీవుడ్ లో సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారం నాలుగేళ్ల క్రితం పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఆనాడు వార్లల్లో ప్రముఖంగా వినిపించాయి. ఈ క్రమంలోనే గతంలో సిట్ అధికారుల విచారణకు హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్ సహా పలువురిని సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో 12 కేసులను నమోదు చేసి, 30 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ మొత్తం కేసులో 11 చార్జీషీట్లను కోర్టులో సిట్ అధికారులు దాఖలు చేశారు. అయితే, ఆ తర్వాత ఈ కేసు వ్యవహారం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ కేసు తేనెతుట్టెను కదిలించేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించనుంది. డ్రగ్స్ క్రయ విక్రయాల్లో భారీగా మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగనుంది.ఈ ప్రకారం మొత్తం 12 మందికి బుధవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో సినీ నటులు రకుల్, రానా, రవితేజ పూరీతో పాటు చార్మీ కౌర్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ ఉన్నారు. వీరితోపాటు రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్-క్లబ్ పబ్ జనరల్ మేనేజర్ ను విచారణ జరపనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ జరగనుంది. దీంతో, టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం రేపింది.
అయితే, ఈ కేసులో రకుల్, రానా, రవిజేత, పూరీని నిందితులుగా చేర్చలేదని, మనీలాండరింగ్‌లో వీరి ప్రమేయం ఉందని కచ్చితంగా ఇప్పుడు చెప్పలేమని ఈడీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఆగస్టు 30న పూరీ, సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్‌క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్ , 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ కేసును తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది.