జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెద్ద షాకే ఇచ్చింది. ఆయన ఆస్తులను ఎటాచ్ చేసుకుంటు ఓ నోటీసు ఇచ్చింది. జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిదుల విషయంలో ఫరూఖ్ మనీల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఎప్పటి నుండో ఆరోపణలు వినబడుతున్నాయి. ఆరోపణలపై ఫరూఖ్ పైన ఈడీ కేసు కూడా నమోదు చేసింది.
చాలా కాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో కోర్టు అనుమతితో చివరకు ఈడి ఫరూఖ్ కు చెందిన మూడు స్ధలాలను, రెండు ఇళ్ళతో పాటు ఓ వ్యాపార భవనాన్ని కూడా స్వాదీనం చేసేసుకుంది. వీటి విలువను ఈడీ రూ. 11.86 కోట్లుగా లెక్క కట్టినప్పటికీ మార్కెట్ విలువ మాత్రం సుమారు రూ. 70 కోట్లుంటుందని అంచనా. క్రికెట్ ఖాతాలోని నిధులను అడ్డంపెట్టుకుని మరికొన్ని భోగస్ ఖాతాలను నడిపారని ఫరూఖ్ తో పాటు మరో పదిమంది కూడా కేసులు నడుస్తోంది.
నిజానికి రాజకీయనేతలకు క్రికెట్ తో ఎలా సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనదేశంలో మొదటినుండి కూడా చాలా రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయనేతలకు క్రికెట్ బోర్డులు లేదా క్రికెట్ సంఘాలతో విడదీయరానంత సంబంధాలున్నాయి. బీహార్ క్రికెట్ సంఘంలో చాలాకాలం మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.
అలాగే బీసీసీఐ, ముంబాయ్ క్రికెట్ అసోసియేషన్లో మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ చాలా కాలంపాటు చక్రం తిప్పారు. పశ్చిమబెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తో పాటు తర్వాత బీసీఐ అధ్యక్షునిగా జగన్మోహన్ దాల్మియా, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు పనిచేసిన విషయం తెలిసిందే.