రీల్ లో కనిపించేది ఏదీ రియల్ కాదు. పాత్రలు.. పాత్రధారులను చూసిన ప్రేక్షకులు వాటికి ఎంతలా కనెక్టు అయిపోతారో.. రీల్ లో చూసిన పాత్రల్ని పోషించిన వారిని ఎంత పర్సనల్ గా తీసుకుంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
యూత్ కలల రాకుమారిగా.. తన అందంతో నిద్రకు దూరం చేసే శ్రీలంక భామ కమ్ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ కు మధ్యనున్న రిలేషన్ ఒక ఎత్తు అయితే.. మందిని మోసం చేసి కోట్లు పోగేసిన అతడు.. జాక్వెలిన్ కు భారీగా బహుమతుల్ని ఇవ్వటం.. అమ్మడు తీసుకోవటం అంతా ఒక ఎత్తు అయితే.. వాటిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించటం మరో ఎత్తు.
అప్పటినుంచి జాక్వెలిన్ కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అప్పటివరకు ముద్దుగుమ్మలా చూసుకున్న ఆమెలో మరో యాంగిల్ బయటకు వచ్చింది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ కేసు దర్యాప్తులో అమ్మడి వద్దకు చేరిన భారీ మొత్తానికి సంబంధించి ఈడీ చర్యలు షురూ చేశారు.
తాజాగా జాక్వెలిన్ కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తుల్ని ఈడీ అధికారులు అటాచ్ చేసుకోవటం ద్వారా భారీ షాక్ ను ఇచ్చారని చెప్పాలి. ఇందులో రూ.7 కోట్లు ఏకంగా ఫిక్సెడ్ డిపాజిట్ కావటం గమనార్హం.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు అయిన మల్విందర్ సింగ్.. శివిందర్ సింగ్ లు జైల్లో ఉండగా.. వారికి బెయిల్ ఇప్పిస్తానంటూ వారి భార్యల నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు. చేతికి వందల కోట్లు చిక్కిన తర్వాత బెయిల్ విషయాన్ని పక్కకు పెట్టేయటంతో శివిందర్ సింగ్ భార్య ఆదితి సింగ్ ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేయటం.. విచారించిన అధికారులు అయ్యగారి భాగోతాన్ని గుర్తించి అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా అతగాడు కొట్టేసిన రూ.200 కోట్లలో దాదాపు రూ.5.7 కోట్ల విలువైన కానుకల్ని జాక్వెలిన్ కు ఆమె కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లుగా గుర్తించారు. దీంతో ఈ కేసులోకి జాక్వెలిన్ ను తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు. సుకేశ్ – జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలతో పాటు.. వారి మధ్యనున్న రిలేషన్ నేపథ్యంలో జాక్వెలిన్ ను విచారిస్తున్నారు.
తాజాగా ఆమె ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసి షాకిచ్చింది. రీల్ లో ముద్దుగుమ్మలా అమాయకంగా ఉడే పాత్రలు చేసిన జాక్వెలిన్ రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆర్థిక మోసగాడితో కలిసి ఉండటం చూస్తే.. ఇది కదా జీవితం అనుకోకుండా ఉండలేం.