ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత ను ఈరోజు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ రోజు రాత్రి 8 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి కవితను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి ఈడీ అదుపులో కవిత ఉండబోతున్నారని తెలుస్తోంది.
మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద కవితను అరెస్టు చేశామని ఈడి అధికారులు వెల్లడించారు. కవిత అరెస్టుపై ఆయన భర్త అనిల్ కుమార్ కు సమాచారం అందించామని అధికారులు చెబుతున్నారు. 14 పేజీల అరెస్టు వివరాలను ఆయనకు అందించామని వెల్లడించారు. కవితను అరెస్టు చేసే సమయంలో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. అయితే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి ఎలా తీసుకువెళ్తారని మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అయితే, చట్ట ప్రకారమే ఆమెను అరెస్ట్ చేశామని అధికారులు చెబుతున్నారు. దాదాపు 5 గంటల పాటు కవితను విచారణ జరిపిన అధికారులు సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం ఈడీ కోర్టులో కవితను హాజరు పరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.