పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొన్ని నెలల కిందటే దీంతో పాటు వేరే చిత్రాల షూటింగ్ కూడా ఆపేసిన సంగతి తెలిసిందే. ఐతే చిత్రీకరణ జరిగిన తక్కువ రోజుల్లోనే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు హరీష్ శంకర్.. ఒకటికి రెండు టీజర్లు వదిలాడు.
ఇటీవలే ముంబయిలో అమేజాన్ ప్రైమ్ మీట్‌కు ‘ఉస్తాద్..’ టీం హాజరైన స్పందర్భంగా హడావుడిగా ఒక టీజర్ రెడీ చేసి వదిలారు. అందులో డైలాగుల విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పవన్ రాజకీయ ప్రయాణానికి ఉపయోగపడేలా.. ఆయన పార్టీ జనసేన గుర్తు గాజు గ్లాసుకు ఎలివేషన్ ఇస్తూ రెండు డైలాగులు రాశాడు హరీష్ శంకర్. ఈ డైలాగ్స్‌లో పంచ్ లేదని.. పవన్‌కు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు బలవంతంగా ఇరికించినట్లుందనే వ్యాఖ్యలు వినిపించాయి.
కట్ చేస్తే ఇప్పుడు ఈ డైలాగుల వల్ల ‘ఉస్తాద్..’ టీం ఇబ్బందుల్లో పడుతోంది. జనసేన గుర్తును ఎలివేట్ చేసేలా ఉన్న పొలిటికల్ డైలాగులపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఏపీ ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా.. ఈ డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉస్తాద్ టీంకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ డైలాగులను పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కిందే పరిగణిస్తున్నట్లు మీనా చెప్పారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవచ్చు. కానీ వాటికి ముందుగా ఈసీ నుంచి అనుమతి పొందాలి. ఐతే ‘ఉస్తాద్..’ టీం క్యాజువల్‌గా పెట్టిన డైలాగులు కాస్తా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కలర్ తీసుకున్నాయి. మరి ఈసీ నోటీసులకు ‘ఉస్తాద్..’ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.