విలయ తాండవం.. అనే మాట వినడమే కానీ.. ఎప్పుడూ మనకు అనుభవంలోకి వచ్చి ఉండదు. కానీ, విలయ తాండవం.. అంటే ఎలా ఉంటుందో.. రెండు ప్రధాన దేశాల ప్రజలు చవిచూశారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరుస భూకంపాలతో థాయిలాండ్, మయన్మార్ దేశాలు విలయ తాండవం చేశాయి. తుఫాను గాలికి మర్చి చెట్టు జడలు విరబోసుకుని ఊగినట్టు భవనాలు ఊగిసలాడాయి. పదాతి దళాలు లాఠీ చార్జీ చేసి.. జల ఫిరంగులు ప్రయోగించినప్పుడు.. పరుగులు పెట్టేలా.. ప్రజలు భయోత్పాతంతో పరుగులు పెట్టిన దృశ్యాలు.. కళ్లు చెమర్చక మానవు. వీటిని చూసి.. `విలయ తాండవం అంటే ఇదే!` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏం జరిగింది?
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా.. మయన్మార్, థాయిలాండ్ ప్రాంతాల్లోని పలు జిల్లాలు భూకంపాలతో నిట్టనిలువునా వణికిపోయాయి. ఈ రెండు దేశాల్లోనూ వరుస భూకంపాల తీవ్రతకు వేలాది మంది మృతి చెంది ఉంటారని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకే మయన్మార్‌లో 150 మందికి పైగా మృతి చెందారని అధికార వర్గాలు తెలిపాయి. మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలింది. దీంతో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇక్కడ భూకంపం వచ్చిన సమయంలో మర్రి చెట్టు ఊగినట్టు ఈ భవనం ఊగిసలాడింది.
ఇక, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. వాటి కింద పడి పాదచారులు, ద్విచక్ర వాహన దారులు కూడా కన్నుమూశారు. ఇక, రహదారులపై తల్లకిందులైన వాహనాలు, ద్విచక్రవాహనాలకు లెక్కే లేకుండా పోయింది. అదేవిధంగా రహదారులు బీటలు వారి.. బీడు భూములను తలపిస్తున్నాయి. ఇలా.. మయన్మార్ రాజధాని సహా పలు జిల్లాల్లో భూకంపం విలయం సృష్టించిందనే చెప్పాలి. మయన్మార్ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు పూర్తిగా నెర్రెలు ఇచ్చాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్ చివురు టాకుల్లా వణికి పోయాయి.
ఇక, థాయిలాండ్ పరిస్థితి మరో విధంగా ఉంది. బ్యాంకాక్‌లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అక్కడి మీడియా చెబుతోంది. రాజఢాని బ్యాంకాక్‌లో భూ ప్రకంపనలతోపాటు.. భయంకరమైన శబ్దాలు రావడంతో ప్రజలు గుండెలు చేత పట్టుకుని పరుగులు తీశారు. థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. ఇక, ఈ దేశంలోనూ వేల మంది పౌరులు మృతి చెంది ఉంటారని జాతీయ మీడియా అంచనా వేసింది. ఇక, ఈ ప్రభావం.. పొరుగున ఉన్న డ్రాగన్ కంట్రీ చైనాపైనా పడింది. ఇక్కడ కూడా.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.