ఇదొక సంచలన విషయమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏపీలో జరగని పరిణామం తెరమీదకి వచ్చింది. అనేక మంది రాజకీయ నాయకులు వ్యాపారాల్లో ఉన్నారు. అనేక మంది కోట్లకు పడగలెత్తారు. సరే.. కష్టపడ్డారు.. తెలివితేటలు ప్రదర్శించారు. దీనికి కొంత రాజకీయ ఎసెన్సును కలుపుకొన్నారు. మొత్తానికి ఎక్కడా ఈ విషయంలో వివాదాలు పడి.. తెరమీదికి వచ్చి.. ఆస్తులు వేలం వేసే వరకు కూడా ఏ ఎమ్మెల్యే పేరు చర్చకు రాలేదు.
కానీ, ఏపీ చరిత్రలో తొలిసారి ఒక ఎమ్మెల్యే ఆస్తులను వేలం వేస్తున్నట్టు బ్యాంకు బహిరంగ ప్రకటన (పత్రిక లకు ఇవ్వడం) చేయడం విస్మయానికి గురి చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సదరు ఎమ్మెల్యే ఎవరో కాదు.. వైసీపీకి చెందిన కీలక నాయకుడు, శ్రీసత్యసాయి(ఉమ్మడి అనంత) జిల్లాలోని పుట్టపర్తి నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కావడం గమనార్హం.
బ్యాంకులకు టోపీపెట్టారంటూ.. దుద్దుకుంట పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఎందుకంటే సదరు కెనరా బ్యాంకు.. ఈ ఎమ్మెల్యే గారి ఆస్తులను వేలం వేయనున్నట్టు జాతీయ మీడియా లోనూ ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే..
రాజకీయాల్లోకి రాకముందు.. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి అయిన శ్రీధర్‌రెడ్డి మధ్యలో 2005-2009 మధ్య ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వంటివాటి వైపు వెళ్లారు. ఈక్రమంలోనే ఆయన మెసర్స్ ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీని ప్రారంభించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత.. భార్య అపర్ణ, తండ్రి వెంకటరామిరెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.
ఈ కంపెనీ కెనరా బ్యాంకు నుంచి 700 కోట్లు అప్పుగా తీసుకుంది. దీనికి వడ్డీతో కలిపి 910 కోట్ల వరకు చేరుకుంది. అయితే.. ఈ సొమ్మును తిరిగి చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో ఆగస్టు 18న ఎమ్మెల్య ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు జారీచేసిన ప్రకటనలో పేర్కొంది. కంపెనీ పేరుతో తీసుకున్న రుణాలు ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయినట్లు బ్యాంకు వెల్లడించింది.