నోరు విప్పితే హితోక్తులతో ఊదరగొట్టే వారు.. తమ వరకు వచ్చినప్పడు వ్యవహరించే తీరుచూస్తే.. వీరేనా సుద్దులు చెప్పేదన్న భావన కలుగక మానదు. ఓవైపు బిహార్ రాష్ట్ర ఎన్నికలు.. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం. ఇలా ఒకేరోజు రెండు పెద్ద ఈవెంట్స్ చోటు చేసుకున్నప్పుడు.. ఖాయంగా ఆ అంశాలే పత్రికల్లో బ్యానర్లుగా మారతాయి. ఈ విషయంలో మరో అవకాశమే ఉండదు. ఎంత తమకు వ్యతిరేకమైన అంశాలు చోటు చేసుకున్నా.. కిందా మీదా పడుతూ కవర్ చేసుకోవటం ఉంటుంది.
అందుకు భిన్నంగా.. మొత్తంగా పక్కన పెట్టేసే విపరీతమైన ధోరణలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు మొత్తం టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారేవే. కేంద్రంపైనా.. ప్రధాని మోడీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. బిహార్ తో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన 11 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో కమలవికాసం చోటు చేసుకుంది. ఇక.. తెలంగాణలో జరిగినదుబ్బాక ఉప ఎన్నికల్లో ఏ మాత్రం అంచనాలు లేని బీజేపీ విజయం సాధించటం గులాబీ బాస్ కు.. గులాబీ నేతకు మాత్రమే కాదు.. వారి ఇంటి పత్రికకు ఇబ్బందిగా మారే అంశం.
అయితే మాత్రం.. ప్రజలకు అందించే సమాచారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే తీరు మాత్రం అభ్యంతరకరం. ఈ రోజు కేసీఆర్ ఇంటి పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీ బ్యానర్ చూస్తే.. షాక్ తినాల్సిందే. ఆ పత్రిక గ్రేటర్ హైదరాబాద్.. తెలంగాణ ఎడిషన్లను పబ్లిష్ చేస్తుంది. మొదటి పేజీ జాకెట్ యాడ్స్ రావటంతో మొదటి పేజీని ఎలా అలంకరించాలన్న ఇబ్బంది తప్పింది. దీనికి తోడు.. లోపల పేజీలో కూడా పెద్ద ఎత్తున యాడ్స్ రావటంతో ఓటమి కష్టాన్ని అధిగమించే అవకాశం కలిగింది.
ఉన్న కూసింత ప్లేస్ లోనూ.. బ్యానర్ గా ఇచ్చిన వార్తల్ని చూస్తే..అవాక్కు అవ్వాల్సిందే. తెలంగాణ ఎడిషన్ కు అరబెడితేనే అధిక లాభం అంటూ పంటను ఆరబెట్టాలన్న వార్తను బ్యానర్ గా వాడారు. ఇక.. గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్ లో.. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే చెత్త ప్లాంట్ ప్రారంబోత్సవ కార్యక్రమాన్ని బ్యానర్ గా వాడారు. పత్రికల గురించి.. మీడియా సంస్థలు అనుసరించాల్సిన తీరు గురించి తరచూ క్లాసులు పీకే వారు.. ఇలాంటి ప్రయారిటీలు ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారిందని చెప్పక తప్పదు.