హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కలకలం సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముందస్తు సమాచారంతో టాస్క్‌పోర్స్ పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో దాదాపు 150 మంది అడ్డంగా దొరికిపోగా…అందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ కొణిదెల నిహారికలతో పాటు పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే, భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికిన ఆ పబ్ లో అరెస్టైన కొద్ది మందిని మినహాయించి మిగతావారికి పోలీసులు నోటీసులిచ్చి వదిలేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణలో పెద్ద చర్చే నడుస్తోంది. అదీగాక, అంతకుముందు డ్రగ్స్ కు బానిసై ఓ యువకుడు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ దందాకు సంబంధించిన నివేదికను అమిత్‌షాకు గవర్నర్ తమిళిసై అందజేసినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై ….గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా ఈ వ్యవహారం చర్చకు వచ్చిందని తెలుస్తోంది.
కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షాతో తమిళిసై భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది, బెంగాల్ తరహాలోనే గవర్నర్ అధికారాలతో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని షా అండ్ కో చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు, ఉగాది సందర్భంగా రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో తమిళిసై కీలక వ్యాఖ్యలుచేశారు. రాజ్ భవన్ పరిధి తనకు తెలుసునని, రాష్ట్ర గవర్నర్ హోదాలో తన పరిమితులు తనకు తెలుసని అన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని, తనకు ఎలాంటి ఇగో లేదని కేసీఆర్ ను ఉద్దేశించి తమిళిసై వ్యాఖ్యానించారు