తనను గెలిపించాలని ప్రజలకు పిలుపు
మరింత సేవ చేసే అవకాశం ఇవ్వాలని భారత సంతతి వైద్యుని వినతి
ఏప్రిల్-6న ఎన్నికలు..అమెరికాలోని ఇల్లినాయిస్లోని `ఓక్ బ్రూక్` గ్రామ ట్రస్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు డాక్టర్ సురేష్ రెడ్డి వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన డాక్టర్ సురేష్ రెడ్డి.. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(ఏఏపీఐ) అధ్యక్షులుగా వ్యవహరించారు. `ఓక్ బ్రూక్` గ్రామ ట్రస్టీ ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రస్టీ పదవికి మొత్తం ఆరుగురు బరిలో నిలిచారు. వీరిలో సురేష్ రెడ్డికూడా ఒకరు. ఈ నేపథ్యంలో తనను గెలిపించా లంటూ.. ఓక్ బ్రూక్ గ్రామ ప్రజలకు డాక్టర్ సురేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
“ఓక్ బ్రూక్ గ్రామ ప్రజలకు ఏదైనా చేయాలనే సత్సంకల్పంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా టాలెంట్, నైపుణ్యాలు, అనుభవం వంటివాటిని రంగరించి.. ఇక్కడి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. సేవ చేయడం అంటే.. నాకు చాలా ఇష్టమైన అంశం. ఈ నేపథ్యంలోనే ఇక్కడివారికి చేతనైనంత సేవ చేయాలని అనుకున్నాను. పబ్లిక్ ఆఫీస్‌ను కూడా తెరవాలని నిర్ణయించా“ అని డాక్టర్ సురేష్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు.
డాక్టర్ సురేష్ రెడ్డి దక్షిణ భారత దేశంలోని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ప్రజా సేవ చేయడాన్ని ఆయన ఎంతో ఇష్టపడే వారు. “నా చిన్న వయసు నుంచే అందరితో కలిసి మెలిసి ఉండేవాడిని. స్నేహితులతో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేవాడిని. అదేవిధంగా కాలేజీలోనూ స్నేహితులను కలుపుకొని అనేక కార్యక్రమాలు చేశాను. విద్యా సంబంధమైన పర్యటనలు కూడా చేశాను. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం చిన్ననాటి నుంచే నాకు అబ్బిన విషయాల్లో ఒకటి“ అని ఆయన పేర్కొన్నారు.
తనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తాను కూడా తిరిగి ఇవ్వాలనే దృక్ఫథంతో తాను ఉన్నట్టు డాక్టర్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆది నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. నిధులు సేకరించి.. గతంలో చదివిన విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేశారు. ఇక, విద్య పరంగా చూసుకుంటే.. డాక్టర్ సురేష్ రెడ్డి.. అడ్వాన్స్ మెడికల్ ట్రైనింగ్‌ను బెత్ ఇజ్రాయెల్ డెకానెస్ మెడికల్ సెంటర్/ హార్వార్డ్ మెడికల్ స్కూల్లో పూర్తిచేశారు. హార్వార్డ్ ఫాకల్టీగా దాదాపు దశాబ్దానికిపైగా పనిచేశారు. ఇక, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ చీఫ్‌గా కూడా సేవలందించారు.
తర్వాత డాక్టర్ సురేష్ రెడ్డి.. తన కుటుంబంతో సహా చికాగోకు తరలివచ్చారు. అయితే.. తాను ఎక్కడ ఉన్న ప్పటికీ తన దాతృత్వాన్ని మాత్రం కొనసాగించారు. ముఖ్యంగా భారత్, అమెరికాల్లో అనేకప్రాజెక్టులకు సాయం చేశారు. అనేక వైద్య శిబిరాలను నిర్వహించారు. అదేవిధంగా వర్క్ షాపులు, సీపీఆర్ ట్రైనింగ్, ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు.. క్యాంపులు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలను డాక్టర్ సురేష్ రెడ్డి.. చికాగో మెడికల్ సొసైటీ భాగస్వామ్యంతో నిర్వహించారు.
ఇక, కోవిడ్ సమయంలోనూ డాక్టర్ సురేష్ రెడ్డి తన సమాజ సేవను కొనసాగించడం విశేషం. వందకు పైగా వెబినైర్ కార్యక్రమాలు నిర్వహించి.. కరోనా నుంచి ప్రజలు ఎలా రక్షణ పొందాలో, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత చలికాలంలో అనేక మంది అవసరంలో ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. “అన్ని తరగతుల ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయాలని భావిస్తున్నాం. గతం కన్నా ఎక్కువగా సేవ చేయాలని తలపోస్తున్నాం. అదేసమయంలో ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు చేస్తూ.. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం“ అని డాక్టర్ సురేష్ రెడ్డి తెలిపారు. ఓక్ బ్రూక్ ట్రస్టీగా తనకు అవకాశం కల్పించాలని.. ఓట్లు వేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.
కరోనా నేపథ్యంలో `మెయిల్ ఇన్ బాలెట్`ను వినియోగించుకోవాలని సురేష్ రెడ్డి.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికిగాను “https;//www.dupageco.org/Election/VoteByMail/.“ను వినియోగించి.. తనను గెలిపించాలని ఓక్ బ్రూక్ ప్రజలకు విన్నవించారు.