ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగులో చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అయితే అందరి ఫోకస్ మాత్రం రెండు చిత్రాలపైనే ఉన్నాయి. అందులో డబుల్ ఇస్మార్ట్ ఒకటి కాగా.. మరొకటి మిస్టర్ బచ్చన్. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ `డబుల్ ఇస్మార్ట్` ను తెరకెక్కించారు. ఇందులో రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించారు. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.
అదే రోజు రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `మిస్టర్ బచ్చన్` కూడా థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్ సూపర్ హిట్ రైడ్ కు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే తాజాగా డబుల్ ఇస్మార్ట్ మరియు మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. బిజినెస్ విషయంలో డబుల్ స్మార్ట్ మూవీ టాప్ లో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ. 39 కోట్ల మేర బిజినెస్ జరుపుకున్న డబుల్ ఇస్మార్ట్ మూవీకి.. వరల్డ్ వైడ్ గా రూ. 48 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. రామ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ఇది. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 49 కోట్లుగా ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రామ్ టార్గెట్ ను రీచ్ అవ్వొచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే.. ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద మంచి హైప్ ను పెంచేశాయి. అందువల్ల మిస్టర్ బచ్చన్ కు కూడా సాలిడ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ. 28 కోట్లకు అమ్ముడు పోయాయి. వరల్డ్ వైడ్ గా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 31 కోట్లు. కాబట్టి ఫుల్ రన్ లో రూ. 32 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను వసూల్ చేస్తే రవితేజ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది.