చాణక్యుడు గురించి భారత దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడి ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసిన చాణక్యుడు రాజనీతితోపాటు ఆర్థిక, భౌతిక, మనస్తత్వ శాస్త్రాలలో కూడా నిపుణుడిగా పేరుగాంచాడు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడిగా ఖ్యాతిగడించిన చాణక్యుడు… తన తెలివితేటలకు, సూక్ష్మ బుద్ధికి ప్రతీతి. చాణక్య రాజనీతిని చూసి శత్రువులు హడలిపోయేవారు. అందుకే చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం, చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందింది.
ఆ కారణంతోనే శతాబ్దాల క్రితం రచించిన చాణక్య నీతి, అందులోని విషయాలకు ఉన్న ప్రాధాన్యత ఈనాటికీ చెక్కుచెదరలేదు. ఈ నేపథ్యంలోనే మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చాణక్య నీతి శాస్త్రంలో చాణక్యుడు ప్రస్తావించాడు. వైవాహిక జీవితం, వృత్తి, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం వంటి అనేక విషయాల గురించి నీతి శాస్త్రంలో ఎన్నో కీలక విషయాలను బోధించాడు. చాణక్యుడు చెప్పిన విషయాలను ఆచరిస్తే ఒక వ్యక్తి తన జీవితంలో విజయవంతం కావడంతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడంటంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఎవరికీ చెప్పకూడని 4 ముఖ్య రహస్యాలున్నాయని చాణక్యుడు అంటున్నాడు. ఆర్థికపరంగా, డబ్బు పరంగా జరిగిన నష్టం గురించి ఒక వ్యక్తి ఎవరికీ చెప్పకూడదనేది చాణక్య నీతి. అలా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి మనల్ని బలహీనులుగా, చులకనగా భావిస్తారనేది చాణక్యుడి భావన. అంతేకాదు, దాన్ని ఆసరాగా చేసుకొని అవతలి వ్యక్తి మీపై ఆధిపత్యం చెలాయించడం, మోసం చేయడం వంటివి చేసేందుకు అవకాశాలుంటాయి అనేది చాణక్య నీతి.
ఇక తన ఇంట్లోని వివాదాల గురించి వేరే వ్యక్తికి చెప్పకూడదని చాణక్యుడు అంటున్నాడు. అలా ఆ వివాదాలను పంచుకోవడం వల్ల అవతలి వ్యక్తి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి, ఎగతాళి చేసే అవకాశం కూడా ఉందట. ఇక, మనల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని చాణిక్యుడు అంటున్నాడు. అలా చెప్పడం వల్ల మనల్ని బలహీన మనస్తత్వం ఉన్నవారిగా ప్రజలు భావిస్తారని, ఎదుటివారు కూడా అవకాశం దొరికితే మనల్ని మోసం చేయడానికి చూస్తారని అంటున్నాడు చాణక్యుడు.
ఇక, మన బలహీనతను వేరే ఎవరికీ చెప్పకూడదని, ఆ లోపాలు తెలుసుకున్న తర్వాత ప్రజలు మనకు హాని కలిగించే అవకాశం ఉందని చాణక్యుడు అంటున్నాడు.