బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీలోని కొందరు నాయకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో ఎవరూ పెట్టుకోవద్దని ఆమె గట్టిగానే హెచ్చరించారు. తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత.. విదేశాల్లో మీడియా వింగులు పెట్టుకుని తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. తనతో పెట్టుకుంటే.. ఆయా నేతల సంగతి తేలుస్తానని చెప్పారు. “నా తో పెట్టుకోవద్దు. నా నోరు మంచిది కాదు. నోరు విప్పితే.. మీరు తట్టుకోలేరు“ అని వ్యాఖ్యానించారు.
ఇదేసమయంలో కేసీఆర్ చుట్టూ ఉన్నవారు.. ఆయనను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానిం చారు. తాను ఎప్పుడు పదవులు చూసుకుని పోరాటాలు చేయలేదన్నారు. కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన చరిత్ర తనకు ఉందన్నారు. ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే.. తానే స్పందించానని.. కొందరు ట్వీట్లు చేసి చేతులు దులుపుకొన్నారని వ్యాఖ్యానించారు. “కేసీఆర్ చుట్టూ ఉన్నవారు ఏం చేశారో.. చెప్పమనండి. నేను ఏం చేశానో.. నేను చెప్పను. తెలంగాణ సమాజం చెబుతుంది“ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక, సొంత పార్టీపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి అనేది ఇప్పుడు పెట్టింది కాదన్న కవిత.. ఇది ఉద్యమం తొలినాళ్లలోనే పురుడు పోసుకుందన్నారు. “పార్టీ చేయని కార్యక్రమాలను జాగృతి తరఫున చేస్తున్నాం. సాంస్కృతిక, సమకాలీన అంశాలపై బలంగా పోరాడాం. ఇది కొనసాగుతుంది.“ అని కవిత తెలిపారు. బీజేపీతో అంటకాగుతున్నది ఎవరో అందరికీ తెలుసని.. ఆ పార్టీ నాయకుల కుటుంబాల్లో పెళ్ళిళ్లకు, ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు ఎవరు వెళ్లాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు.
తనను.. పార్టీని నుంచి బయటకు పంపించేలా.. కేసీఆర్‌కు తనకు మధ్యఅఘాధం సృష్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారని కవిత అన్నారు. అయితే.. ఇది జరగని పని అని పేర్కొన్నారు. తాను ఎవరి నాయ కత్వం కింద పనిచేసేది లేదన్నారు. కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నదే తన ఆకాంక్షగా చెప్పిన కవిత.. ఈ క్రమంలో ఏం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కేసీఆర్.. లీకు వీరులను బయట పెడతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.