ప్రత్యక్ష రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమకాలీన రాజకీయాలపై మాట్లాడితే జనాలు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తారు. అధికారంలో ఉన్న ప్రభుత్వ పనితీరుపై తులనాత్మక పరిశీలనతో ఆయన చేసే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటూ ఉంటాయి.
ఏ విషయం మాట్లాడినా బాగా పరిశోధన, పరిశీలన చేసే మాట్లాడతారు కాబట్టి.. ఆయన వ్యాఖ్యలకు ఈ ప్రాధాన్యం దక్కుతుంటుంది. అందుకే తమపై ఉండవల్లి ఏం బాంబులు పేలుస్తాడో అని అధికారం ఉన్న వాళ్లకు కొంచెం గుబులుగానే ఉంటుంది.
గత పర్యాయం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేశారు. ఇప్పుడాయన అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకూ విమర్శల స్వరం పెంచుతున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల మీద తీవ్ర స్థాయిలో రగడ జరిగిన నేపథ్యంలో ఈ విషయమై ఆయన రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో జగన్ సర్కారు పరిపాలనను తీవ్రస్థాయిలోనే దుయ్యబట్టారు.
జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అని తేల్చేశారు ఉండవల్లి. ఏపీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని.. ఇక ముందు అప్పులు కూడా పుట్టని పరిస్థిత నెలకొందని ఉండవల్లి అన్నారు. పోలవరం సహా ఎందులోనూ అభివృద్ధి అన్నదే కాన రావడం లేదని ఆయన విమర్శించారు.
కాగ్ నివేదికపై అసెంబ్లీలో ఎందుకు చర్చించట్లేదని ఆయన ప్రశ్నించారు. విపక్షం లేకుండా సభ నిర్వహించి ఏం ప్రయోజనం అని ఉండవల్లి అన్నారు.
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ఉదాహరణగా చూపించి తాను వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడాన్ని జగన్ సమర్థించుకుంటున్నారని.. కానీ ఇలాంటి సమయంలో సీఎం క్షేత్రస్థాయికి వెళ్లి జనాలకు ధైర్యం చెప్పడం, సహాయ చర్యలు మరింత బాగా జరిగేలా చూడటం అవసరమన్నారు ఉండవల్లి. తమిళనాడు సీఎం స్టాలిన్ వరద సమయంలో జనాల్లోకి వెళ్లిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు.
నవీన్ పట్నాయక్ మీద ఏ ఆరోపణలూ లేకపోవడం వల్ల ఆయన గెలుస్తున్నారని.. కానీ ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఉండవల్లి ఆరోపించారు. ఇక చంద్రబాబు కుటుంబం మీద అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఉండవల్లి ఖండించారు.
ఎన్టీఆర్ కూతుళ్లపై తాను ఎప్పుడూ చెడు ప్రచారాలను వినలేదని.. తన కుటుంబం విషయంలో దారుణంగా మాట్లాడినందుకే చంద్రబాబు విలపించారని.. ఆయనది డ్రామా అని తాను అనుకోవడం లేదని.. కానీ ఆయన అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం కూడా లేదని.. దీని వల్ల సానుభూతి ఏమీ రాదని ఉండవల్లి తేల్చేశారు.