తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ యువ నేత, డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి గురించి తిరుపతి జిల్లా ప్రజలకు పరిచయం అక్కర లేదు. రియల్టర్ గా డాలర్స్ గ్రూపు ద్వారా ప్రజలకు సుపరిచితమైన ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్…2024 ఎన్నికలలో చంద్రగిరిలో టీడీపీ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టానికి తగిన గుర్తింపునిస్తూ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్ పదవిని మంత్రి లోకేష్ అప్పగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 21న మధ్యాహ్నం 3.30 నిమిషాలకు తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే 4 వేల మంది అనుచరులతో తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్ నుండి తుడా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ చేయబోతున్నారు. తుడా ఛైర్మన్ కాబట్టి టీటీడీ బోర్డులో ఎక్స్ అఫీషియో మెంబర్ గా కూడా డాలర్స్ దివాకర్ రెడ్డికి హోదా దక్కనుంది.
తిరుపతి రాజకీయాలలో డాలర్స్ దివాకర్ రెడ్డి ఉజ్వల భవిష్యత్తుకు తుడా ఛైర్మన్ పదవితో తొలి అడుగుపడిందని ఆయన అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రగిరి నియోజకవర్గం తరఫున టీడీపీ టికెట్ ను డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశించారు. అయితే, పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతూ వస్తున్న పులివర్తి నాని వైపు టీడీపీ హై కమాండ్ మొగ్గు చూపింది.
అయినా సరే, పులివర్తి నాని గెలుపు కోసం డాలర్స్ దివాకర్ రెడ్డి అహర్నిశలు పాటుబడ్డారు. ఈ క్రమంలోనే లోకేశ్ దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో, తుడా చైర్మన్ చేస్తానని అప్పట్లోనే లోకేష్ హామీ ఇచ్చారు. అందుకే తిరుపతిలో ఎంతమంది టీడీపీ నేతలు పోటీపడ్డప్పటికీ డాలర్స్ దివాకర్ రెడ్డిని లోకేష్ గుర్తుపెట్టుకొని మరీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.