మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పటికే తండ్రిని మించిన తనయుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంచరణ్.. తన రూటే సపరేటు అంటూ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.
ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే ఏ హీరో అయినా తీవ్ర ఒత్తిడికి లోనవడం సర్వసాధారణం. మరీ సెన్సిటివ్ పర్సన్ అయితే ఆ పరాజయం నుంచి బయటకు రావడానికి చాలా టైం తీసుకుంటాడు. కానీ రామ్ చరణ్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమట. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఈయన ఏం చేస్తాడో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ మెగా హీరో తన సినిమా పరాజయం పాలైతే పార్టీ చేసుకుంటాడట.
వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా బయట పెట్టాడు. `సినిమా ఫలితాల గురించి మరీ అంత ఒత్తిడి గా ఫీల్ అవ్వను. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే రిలాక్స్ అయ్యేందుకు పార్టీ చేసుకుంటాను. సక్సెస్ వచ్చినా కూడా పార్టీ చేసుకుంటాను. ఆర్ఆర్ఆర్ హిట్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి పట్టించుకోను. చేసే పని మనసుకు నచ్చిందా లేదా అన్నది మాత్రమే చూస్తాను` అంటూ రామ్ చరణ్ తాజాగా చెప్పుకొచ్చాడు.
కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ మూవీ అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16 చిత్రాన్ని చేయనున్నాడు. ఇటీవల వీరి ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.