బీజేపీ మీద కోపాన్ని ఉత్తరాది రాష్ట్రాలను అవమానపరిచేలా నోరు జారారు డీఎంకే లోక్ సభ సభ్యుడు డీఎన్ వీ సెంథిల్ కుమార్. వివాదాస్పందంగా మారిన ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. అయితే.. తాను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పటం ద్వారా వివాదం ఒక కొలిక్కి వచ్చినా.. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోపతాపాలు ఎవరికైనా మామూలే అయినా.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు.. ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. దేశంలో చీలిక తెచ్చేలా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇంతకూ డీఎంకే ఎంపీ ఏమన్నారు? ఏ సందర్భంలో అన్నారు? తర్వాతేమైంది? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే..
జమ్మూకశ్మీర్ పై పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సెంథిల్ కుమార్ మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రస్తావన వచ్చింది. బీజేపీ దక్షిణాదిలో గెలుపు అసాధ్యమని.. కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే ఆ పార్టీ గెలుస్తుందన్న వ్యాఖ్య చేస్తూ. తాజా ఎన్నికల ఫలితాల్ని ఉటంకించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఆయన చేయకూడని తప్పు చేశారు. బీజేపీ గెలుపు ఉత్తరాదికే పరిమితమంటూ.. ఆయా రాష్ట్రాలను గోమూత్రంతో పోల్చి.. సంబోధించారు. అంతే.. సెంథిల్ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది.
ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యను తీవ్రంగా తప్పు పట్టింది. సెంథిల్ వ్యాఖ్యలు విద్వేషానికి నిదర్శనమన్న బీజేపీ.. దక్షిణాదిలో ఇండియా కూటమి నామరూపాల్లేకుండా పోతుందని బీజేపీ మండిపడింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యను లోక్ సభ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. అయితే.. అప్పటికే ఆయన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది. పార్లమెంటు వేదికగా అలాంటి పదజాలం వాడటం ఏ మాత్రం సరికాదంటూ.. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.
తన నోటి నుంచి వచ్చిన మాట ఎంత దారుణమైనదన్న విషయాన్ని అర్థం చేసుకున్న సెంథిల్ కుమార్ వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. పొరపాటున ఆ పదాన్ని వాడినట్లుగా చెప్పి.. ఉద్దేశపూర్వకంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తప్పుడు సంకేతం వెళుతుందన్న ఉద్దేశంతో తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా చెప్పి.. వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.