వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని గురించి అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు ముద్దుగా బూతుల మంత్రి అని పిలుచుకునే నాని….ప్రెస్ మీట్ పెడితే చాలు చంద్రబాబును, లోకేష్ ను, కొన్ని పత్రికలను, న్యూస్ చానెళ్లను తిట్టనిదే ముగించరు. కొన్ని పత్రికలు, చానెళ్లు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయని వాటి ఓనర్లపై నాని నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. బూతు లేనిదే మాట్లాడలేని నాని అంటూ టీడీపీ నేతలు దుయ్యబడుతుంటారు.
ఈ క్రమంలోనే కొడాలి నానిపై టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి పలు మార్లు విమర్శలు గుప్పించారు. తాజాగా మరోసారి నానిని ఉద్దేశించి దివ్యవాణి షాకింగ్ కామెంట్లు చేశారు. కొడాలి నాని నోరు విప్పితే బూతులు తప్ప మరేమీ రావని, రాజకీయాల కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే పంచెలూడదీసి కొడతామని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్లు వేసి చూపించాలని దివ్యవాణి సవాల్ విసిరారు.
గుడివాడ గడ్డను టీడీపీ అడ్డాగా మారుస్తామని దివ్యవాణి అన్నారు. నాని అంటే ఏంటో గుడివాడ ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కొడాలి నానికి మరోసారి అవకాశం ఇవ్వరు.. ఇవ్వబోరంటూ బల్లగుద్ది చెప్పారు. టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని, తిరిగి తామే రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. వైసీపీ పాలన అంతమయ్యే రోజు దగ్గరలో పడిందని దివ్యవాణి అన్నారు. గుడివాడలో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్న దివ్యవాణి పై వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి ఊడిపోయిన తర్వాత కొడాలి నాని కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. అరకొర ప్రెస్ మీట్లలో మాట్లాడినా కూడా…గతంలో మాదిరిగా బూతులతో విరుచుకుపడడం లేదు. ఈ క్రమంలో మరి, దివ్యవాణి కామెంట్లపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.