టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని, నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలనే మోసం చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష వైసీపీ జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా `వెన్నుపోటు దినం` నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రస్థాయిలో నిర్వాహణ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించింది. వెన్నుపోటు దినం కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో వెన్నుపోటు దినం గురించి వైసీపీ తెగ ప్రచారం చేసింది. కట్ చేస్తే క్షేత్రస్థాయిలో ఫ్యాన్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.. అంతా ముందుండి నడిపించాల్సిన జగన్ బెంగళూరు పోయి ప్యాలెస్‌లో సేద తీరుతూ నేతలకు టాస్క్ ఇచ్చారు. పోని పార్టీలోని ముఖ్య నేతలైనా యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదు.
అధ్యక్షుడే రానప్పుడు మేమెందుకు వస్తాం అన్న చందంగా వెన్నుపోటు దినం కార్యక్రమానికి ముఖం చాటేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి కొద్దిమంది నాయకులే తప్ప మిగతా కీలక నేతలెవరు ఈ కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. వై.వి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు కూడా ఎక్కడ కనిపించింది లేదు. ఈ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నారు.
అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తయింది. ఇంత తక్కువ సమయం ఇచ్చి వైఫల్యాలపై దుమ్మెత్తి పోయడం దూకుడు చర్య అవుతుందని భావించి వైసీపీలో కొందరు నాయకులు వెనకడుగు వేశారు. మరికొందరు కేసుల భయంతో ముందడుగు వేయడానికి భయపడ్డారు. కారణం ఏదైనా జగన్ తో పాటు పార్టీలోని ముఖ్య నేతలు కూడా కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరుస్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే వెన్నుపోటు దినంలో మీ తొత్తులెక్కడ జగన్ అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.