- ‘దిశ’ పోలీసు స్టేషన్లు,
- కోర్టులంటూ హడావుడి
- అసెంబ్లీ ఆమోదించిన బిల్లును
- తిరస్కరించిన కేంద్రం
- మార్పులు చేసినా అంగీకరించని వైనం
- అయినా రాష్ట్రప్రభుత్వం అత్యుత్సాహం
తెలంగాణలో ఒక చిన్నారిపై అఘాయిత్యం జరిగితే… వ్యవస్థ మొత్తం ఏకమై ముందుకు కదలింది. ప్రతిపక్షాల డిమాండ్ గవర్నమెంట్ శిరసావహించింది. నిందితుడు మనిషిగానో, శవంగానో దొరికేదాకా ఊరుకోలేదు. ఇంతా జరిగితే అక్కడ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన కనిపించని దిశ కూడా లేదు. అయినా త్వరగా న్యాయం జరిగింది.
మరి ఏపీలో ఏం జరుగుతోంది?
దిశ చట్టం.. మహిళల భద్రత కోసమంటూ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటున్న చట్టం కాని చట్టమిది. 2019 నవంబరులో తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై స్పందించిన ఆంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ‘దిశ’ పేరిట బిల్లును రూపొందించి.. శాసనసభతో ఆమోదముద్ర వేయించారు.
పోలీసు దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తిచేసి.. కోర్టు విచారణను మరో రెండువారాల్లో ముగించి.. అంటే 21 రోజుల్లో విచారణ ప్రక్రియను పూర్తిచేసి.. దోషులకు శిక్ష విధించడం దీని ప్రధానోద్దేశం. అత్యాచార దోషులకు ప్రస్తుతం గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుండగా.. మరణశిక్ష విధించాలని దిశ బిల్లులో పేర్కొన్నారు.
భారత శిక్షాస్మృతి-1860లోని సెక్షన్ 376ను ఈ మేరకు సవరించారు. అలాగే అత్యాచార నేరాల సత్వర విచారణకు ‘దిశ’ ప్రత్యేక కోర్టులను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మహిళలు, చిన్న పిల్లలపై నేరాలు, అత్యాచారాలు, వేధింపుల కేసులు, పోస్కో చట్టం కింద ఉన్న కేసులన్నిటినీ ఈ కోర్టులు విచారణ జరుపుతాయని పేర్కొంది.
అయితే దిశ బిల్లును రాష్ట్రప్రభుత్వం ఉమ్మడి జాబితాలో చేర్చింది. ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలకు కేంద్రం ఆమోదం తప్పనిసరి. 21 రోజుల్లో దోషికి శిక్ష విధించాలనడం సహజ న్యాయ ప్రక్రియకు విరుద్ధమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. దీనిని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తిరస్కరించే అవకాశమూ ఉంది. బిల్లు రూపకల్పన సమయంలో అధికారులు ఈ అంశంపై దృష్టిపెట్టలేదని న్యాయనిపుణులు అంటున్నారు.
‘కేవలం వారంలో నిందితులను గుర్తించడం ఎలా సాధ్యం? అంత తక్కువ వ్యవధిలో దర్యాప్తు, కోర్టు విచారణ ఎలా పూర్తవుతాయని ప్రశ్నిస్తున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రక్రియను ఎలా అమలు చేస్తారు.. ఎవిడెన్స్ యాక్టుకు అనుగుణంగా నిష్పాక్షిక విచారణ జరుగుతుందా..’ అని ప్రశ్నిస్తున్నారు. అన్నిటినీ మించి కేంద్రం తెచ్చిన నిర్భయ చట్టంలో 9 నెలల్లో విచారణ ప్రక్రియ పూర్తిచేయాలని పొందుపరిచారు. కేం
ద్ర చట్టానికి భిన్నంగా రాష్ట్ర అధికారులు బిల్లును ఎలా రూపొందించారని నిలదీస్తున్నారు. ఇలాంటి నిబంధనలను మార్చాలని కేంద్రం దిశ బిల్లును తిప్పిపంపింది. సదరు మార్పులతో మళ్లీ బిల్లును సవరించి పంపారు. కానీ ఇంకా కేంద్రం పరిశీలనలోనే ఉంది. దానిని అది పార్లమెంటులో ఆమోదముద్ర వేయించి.. రాష్ట్రానికి పంపాక.. ఇక్కడ మళ్లీ దానిని ఆమోదించి.. గవర్నర్ సంతకం పడితేనే చట్టరూపం దాల్చుతుంది.
ఎందుకీ హడావుడి..?
ఈలోపు దిశ బిల్లు ఇంకాచట్టం కాకముందే జగన్ ప్రభుత్వం అది అమల్లోకి వచ్చేసినట్లుగా ఆర్భాటం చేస్తోంది. ఓపక్క కేంద్రం దానిపై ఆమోదముద్ర వేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశిస్తున్నారు. ఇదే సమయంలో హడావుడిగా దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తున్నారు. అది చట్టరూపం దాల్చకముందే ప్రత్యేక కోర్టులు కూడా పెడతామంటున్నారు (ఇప్పటికే ఉన్న పోస్కో కోర్టులను దిశ కోర్టులుగా మలిచే ఉద్దేశంతో ఉన్నారు).
దిశ చట్టం కింద 600 వరకు కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో 21 రోజుల్లో విచారణ పూర్తయిన కేసు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. జూన్ 21న తాడేపల్లిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులకు నెలన్నర పట్టింది. ఈ నేపథ్యంలో వారంలో అరెస్టులు, దర్యాప్తు ఎలా పూర్తవుతాయని మాజీ పోలీసు ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇంకోవైపు.. మహిళల భద్రత కోసమంటూ సీఎం జగన్ తాజాగా ఓ పాత యాప్ను అమల్లోకి తెచ్చారు. 2015 జూన్ 21న విజయవాడలో సినీనటుడు సాయికుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులతో కలసి ప్రజల సమక్షంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఫోర్త్ లయన్’ యాప్ను ప్రారంభించారు. అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారు.
ఆయన నిఘా విభాగానికి బదిలీ అయ్యాక నగర పోలీస్ కమిషనర్గా వచ్చిన గౌతమ్ సవాంగ్ (ప్రస్తుత డీజీపీ).. కళాశాల యువతతో సమావేశాలు నిర్వహించి పదేపదే ఫోర్త్ లయన్ గురించి వివరించేవారు. యాప్ వల్ల ఉపయోగాలతో పాటు రక్షణ ఉంటుందని, డౌన్లోడ్ చేసుకోవాలని సూచించేవారు.
దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ అంటూ విజయవాడ పోలీసులూ పలు సందర్భాల్లో చెప్పేవారు. అతి తక్కువ కాలంలోనే లక్ష మందికి పైగా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. ఇప్పుడు అదే యాప్ను కొత్తగా తెచ్చినట్లు సవాంగ్ డీజీపీ హోదాలో కలరింగ్ ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.