‘కల్కి 2898 ఏడీ’తో సంచలనం రేపిన యువ దర్శకుడు నాగ్ అశ్విన్.. సాధారణంగా వివాదాలకు పూర్తి దూరంగా ఉంటాడు. నిజ జీవితంలోనూ చాలా సింపుల్‌గా ఉండే నాగి.. మీడియాను కలిసినపుడు కూడా అదే సింప్లిసిటీని కొనసాగిస్తాడు. ఎవరైనా కవ్వించేలా ప్రశ్నలు వేసినా కూల్‌గా సమాధానం ఇస్తాడు. విమర్శలను కూడా సానుకూలంగా తీసుకునే దర్శకుడతను.
అలాంటి వ్యక్తి ఇప్పుడు చేసిన ఓ కామెంట్ వివాదాస్పదం అవుతోంది. ‘కల్కి’ ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నాగి ఒక పోస్ట్ పెట్టాడు. ఈ మైలురాయి తమ లాంటి యంగ్ టీంకు చాలా పెద్ద ఘనత అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన నాగి.. తాము సినిమాలో రక్తం చూపించకుండా, అశ్లీలత లేకుండా.. రెచ్చగొట్టే కంటెంట్ లేకుండా సినిమా తీసి ఈ మైలురాయిని అందుకున్నామని.. కాబట్టి ఈ విజయం ఇంకా ప్రత్యేకమైందని అతను పేర్కొన్నాడు.
ఈ పోస్టు నాగ్ అశ్విన్ యథాలాపంగా పెట్టింది కాదని.. మరో టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేసేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో పాటు ‘యానిమల్’ సినిమా బ్లాక్బస్టర్లు అయినప్పటికీ సందీప్ రెడ్డి ఆయా చిత్రాల్లో చూపించిన విషయాల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ‘యానిమల్’ సినిమాలో హీరో పశు ప్రవృత్తి.. మహిళల పట్ల అతడి తీరు.. కొన్ని డైలాగుల విషయంలో విమర్శలు తప్పలేదు.
స్వయంగా సినీ వర్గాల నుంచి ఈ సినిమా పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. జావెద్ అక్తర్ లాంటి దిగ్గజంతో పాటు అనేకమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను తప్పుబట్టారు. యువతను తప్పుదోవ పట్టించేలా ఈ చిత్రం ఉందన్నారు. చెడును గ్లోరిఫై చేస్తూ సినిమా తీసి సొమ్ము చేసుకున్నాడంటూ సందీప్‌ను తప్పుబట్టారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ పోస్టు చూస్తే.. సందీప్ తీసిన ‘యానిమల్’కు కౌంటర్లాగే కనిపిస్తోంది. తాము క్లీన్ కంటెంట్‌తోనే ఇంత పెద్ద విజయం సాధించామంటూ సందీప్‌ను ఎద్దేవా చేస్తున్నట్లుగా ఈ పోస్టు ఉండడంతో సందీప్ అభిమానులు నాగి మీద మండిపడుతున్నారు. ఒక సినిమా ఇలాగే తీయాలని రూల్ ఉందా.. సాటి తెలుగు దర్శకుడు బాలీవుడ్లో తిరుగులేని సక్సెస్ అందుకుంటే తన మీద ఇలా కౌంటర్లేంటి అంటూ నాగిని తప్పుబడుతున్నారు.