ఈ ఏడాది ఇండియన్ సినిమాలో అతిపెద్ద సక్సెస్ అందుకున్న చిత్రాల్లో యానిమల్ ఒకటి. అంతేకాక అత్యంత వివాదాస్పదమైన చిత్రంగానూ దీన్ని చెప్పవచ్చు. క్రిటిక్స్ అనే కాక కొందరు ఫిలిం సెలబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని ఘాటుగా విమర్శించారు. దర్శకుడు సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. అయితే తన సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం, విజయాన్ని అందుకోవడంతో సందీప్ ఈ విమర్శలను ఎంత మాత్రం పట్టించుకునే స్థితిలో లేడు.
కాగా, ఇప్పుడు సందీప్ కు లెజెండ్ నుంచి పెద్ద ప్రశంస దక్కింది. యానిమల్ ను 2023 సంవత్సరానికి బెస్ట్ ఫిల్మ్ గా అభివర్ణించడమే కాక.. సందీప్ ను గొప్ప దర్శకుడుగా కొనియాడిన ఆ లెజెండ్ కరణ్ జోహార్. 2023 లో ఇండియన్ సినిమాకు సంబంధించి ఒక రౌండ్ టేబుల్ చర్చ కార్యక్రమంలో కరణ్ మాట్లాడుతూ.. యానీమల్ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. తాను ఈ నిర్ణయానికి రావడానికి కొంచెం సమయం పట్టిందని, ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంచెం భయపడ్డాడని, కానీ తన దృష్టిలో 2023 సంవత్సరానికి యానిమల్ యే బెస్ట్ మూవీ అని అతను ప్రకటించాడు.
ఈ మాట అందరికీ రుచించకపోయినా యానిమల్ స్టీరియో టైప్స్ అన్నిటినీ బ్రేక్ చేసిన ఒక గొప్ప ప్రయోగం అని కరణ్ పేర్కొన్నాడు. సినిమా గ్రామర్ ను మార్చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి అని.. హిందీలో తన తొలి చిత్రం కబీర్ సింగ్ ను ఎంతో మంది విమర్శించినప్పటికీ అది తనకెంతో నచ్చిందని.. తనదైన టేకింగ్ తో సందీప్ రెడ్డి మిగతా దర్శకులకు సవాలు విసిరాడని కరణ్ ప్రశంసించాడు. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ను శాసిస్తున్న కరణ్ జోహార్ లాంటి గ్రేట్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ నుంచి మన తెలుగు దర్శకుడు ఇలాంటి ప్రశంశలు పొందడం అరుదైన విషయమే.