కోలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరున్న హీరో ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్ లు ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ జంట తీసుకున్న నిర్ణయం సౌత్ ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అయితే, కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సమయం ఇంట్లో గడపడం వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. కారణాలేమైనా..వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అయితే, అనూహ్యంగా వీరిద్దరూ విడాకులపై నిర్ణయాన్ని పున:సమీక్షించబోతున్నారని తాజాగా కోలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. తమ ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామంటూ ప్రకటించిన ఈ క్యూట్ కపుల్..ఓ ఈవెంట్ సందర్భంగా తాము కలిసి ఉండబోతోన్న నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారట.
ఇటీవల ఈ జంట కౌన్సెలింగ్ తీసుకుందట. దాంతోపాటు, ఇరు కుటుంబాల పెద్దలు కూడా వారికి నచ్చజెప్పారట. దీంతో, ఈ జంట తమ పిల్లల కోసం విడాకుల నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్త తెలిసిన ధనుష్, రజనీకాంత్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట మాదిరిగానే నాగచైతన్య, సమంతలు కూడా కలిస్తే బాగుంటుంది అంటూ వారి అభిమానులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.