ఢిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకు ఆప్ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే, దానిని తలపించేలా ఏపీ లిక్కర్ స్కాం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలలో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ కుంభకోణంలో మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌రెడ్డితో పాటు, అప్పటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వారిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
గత మూడు రోజులుగా ఆ ఇద్దరిని విచారణ జరిపిన సిట్ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ కుంభకోణంలో వారి ప్రమేయంపై స్పష్టత వచ్చిన తర్వాత అరెస్టు చేశారు. 9 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత వీరిద్దరినీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ధనుంజయ్‌రెడ్డి ఏ 31 నిందితుడిగా, కృష్ణమోహన్‌రెడ్డి ఏ32 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో వీరిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో వారిని అరెస్టు చేశారు.
పిటిషనర్లకు వ్యతిరేకంగా తగిన ఆధారాలున్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందు వల్ల ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి విచారణకు బెయిల్ ఆటంకం కలిగించినట్లవుతుందని అభిప్రాయపడింది. ఏపీ హైకోర్టు కూడా వీరి ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇక, వీరిద్దరూ రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టు లేదా ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.