ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీసుస్టేషన్లో హాజరుకావాలని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు..పాసుపోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయనకు బెయిల్ రావడం సంచలనంగా మారింది. 2019 మార్చి 15 న పులివెందులలో ఆయన ఇంట్లోనే మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కొందరు కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశారు.
ఆయన తొలుత గుండెపోటుతో మరణించారని బయట ప్రపంచానికి చెప్పినా…ఆ తర్వాత హత్యగా తేల్చారు. ఈ ఘటనపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు సైతం డిమాండ్ చేశారు. హత్యకేసు చేధించిన పోలీసులు…ద స్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి సహా కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీబీఐ విచారణ చేపట్టగా..వివేకా హత్య ఇది ఇంటి దొంగల పనేనని తేలింది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తో పాటు, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కీలక నిందితులుగా సీబీఐ విచారణలో తేలింది. ఈకేసులో కీలక నిందితుడు దస్తగిరి సీబీఐ అప్రూవర్‌గా మారి సాక్ష్యమిచ్చారు.
తమకు డబ్బు ఆశ చూపి భాస్కర్‌రెడ్డితోపాటు, అవినాష్‌రెడ్డి కీలక అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఈ హత్య చేయించినట్లు ఒప్పుకున్నారు. సీబీఐ 2021 సెప్టెంబర్ 17న హైదరబాద్‌లో శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్ప టికీ… నిందితులు బయట ఉంటే సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందన్న సీబీఐ వాదనతో కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. మరోసారి శివశంకర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో బెయిల్లుకు దరఖాస్తు చేసుకోవడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవీ షరతులు
+ రూ.2 లక్షల పూచికత్తు సమర్పించాలి.
+ ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలి
+ సీబీఐ కోర్టులో ట్రయిల్ జరిగేటప్పుడు ఏపీలో ఉండకూడదు.
+ పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలి