ఒకప్పుడు తన సంగీతంతో తెలుగు మ్యూజిక్ లవర్స్‌ను ఒక ఊపు ఊపిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.. కొన్నేళ్ల నుంచి అంచనాలకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వట్లేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇది దేవి అందించిన ఆల్బమేనా అని ఆశ్చర్యపోయిన సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. ఐతే ఉన్నంతలో దేవి మంచి ఔట్ పుట్ ఇచ్చిన చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి.
ఆ సినిమా పాటలు కూడా మొదట్లో సోసోగా అనిపించినా.. తర్వాత జనాలకు బాగా ఎక్కేశాయి. సినిమా రిలీజైన ఏళ్ల తర్వాత కూడా ఆ పాటలు ఇంకా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఐతే ‘పుష్ప’ పాటల సంగతి మరిచిపోయి ‘పుష్ప-2’ సాంగ్స్‌తో ఊగిపోవాల్సిన టైం వచ్చింది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుండగా.. ఈలోపు ప్రమోషన్లు మొదలుపెట్టి ఒక్కో పాట లాంచ్ చేస్తున్నారు. కానీ ఆ పాటలు అనుకున్నంత కిక్ ఇవ్వట్లేదు.
ఆల్రెడీ ‘పుష్ప పుష్ప పుష్ప..’ అంటూ ఒక పాట లాంచ్ చేసింది టీం. ఐతే ఆ పాట విషయంలో మిశ్రమ స్పందనే వచ్చింది. లిరిక్స్ బాగున్నప్పటికీ.. ట్యూన్ రొటీన్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పాట అనుకున్నంతగా జనాల్లోకి వెళ్లలేకపోయింది. ‘దాక్కో దాక్కో మేక…’, ‘ఏ బిడ్డా..’ స్థాయిలో వైరల్ అవ్వలేదు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ‘సూసేకి..’ అంటే డ్యూయెట్ రిలీజ్ చేశారు. ఈ పాట బాలేదు అనలేం కానీ.. ‘శ్రీవల్లి’ పాట స్థాయిలో మాత్రం లేదు.
వినగా వినగా ఏమైనా ఫీల్ మారుతుందేమో కానీ.. ఇన్స్టంట్ రియాక్షన్ అయితే జస్ట్ ఓకే అనే వినిపిస్తోంది. ఈ పాట లిరిక్స్, శ్రేయ ఘోషల్ సింగింగ్ బాగున్నా.. ‘పుష్ప-2’ సాంగ్స్ మీద అంచనాలను అందుకునే స్థాయిలో అయితే పాట లేదు. ఐతే ఈ పాటకు సంబంధించిన రిహార్సల్స్ విజువల్స్‌తోనే లిరికల్ వీడియోను లాగించేశారు. ఒరిజినల్ విజువల్ ఒక్కటీ చూపించలేదు. అవి ఒక రేంజిలో ఉంటాయని.. ఆ విజువల్స్‌తో పాటు పాట చూస్తే కిక్కు వేరే రకంగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.