‘అన్న ఎన్టీఆర్’ వీరాభిమానులకు నిలయమైన డిట్రాయిట్ లో తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు తెర కృష్ణుడు, వెండి తెర రాముడు, తెలుగింటి ‘అన్నగారు’ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుక అత్యంత ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమాన్ని ‘డిట్రాయిట్ గళం’ గా పిలవబడే ‘ఉదయ్ చాపలమడుగు’ ఆసాంతం ఎంతో ఉల్లాసంగా నడిపించారు.
రాజకీయాలకు అతీతంగా, ఒక తెలుగు నాయకుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన ‘ఎన్టీఆర్’ను స్మరించుకునే ఈ కార్యక్రమానికి ‘అన్న ఎన్టీఆర్’ ముద్దుల మనుమరాలు ‘శ్రీమతి సుహాసిని నందమూరి’, ప్రముఖ గీత రచయిత, కవి, అవధాని ‘జొన్నవిత్తుల’, ‘అన్న ఎన్టీఆర్’ వీరాభిమాని, దర్శకుడు ‘వై వి ఎస్ చౌదరి’ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
‘శ్రీమతి సుహాసిని నందమూరి’ ప్రసంగిస్తూ, చిన్నప్పుడు కుటుంబంలో అందరితోనూ ‘ఎన్టీఆర్’ ఎంతో సరదాగా గడిపేవారని చెప్పారు. తన తండ్రి ‘హరికృష్ణ’ వెంట అనేక సార్లు తాను తాత ‘ఎన్టీఆర్’ వద్దకు వెళ్లినట్టు చెప్పారు. తనకు, తాత గారి స్మృతులు ఇప్పటికీ గుర్తున్నాయని, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నానని తెలిపారు.
కవి, అవధాని ‘జొన్నవిత్తుల’ మాట్లాడుతూ, ‘అన్నఎన్టీఆర్’ను తాను చాలా దగ్గరగా చూశానని చెప్పారు. తాను అవధాని కార్యక్రమాలు చేసిన సమయంలో ఓ సందర్భంలో ‘అన్నగారు’ స్వయంగా తనకు ప్రశ్నలు ఇచ్చి పూరించమని చెప్పారని అన్నా రు. తెలుగు భాష అన్నా, యాస అన్నా, ‘అన్నఎన్టీఆర్’ గారికి ప్రాణంతో సమానమని తెలిపారు.
‘అన్న ఎన్టీఆర్’ వీరాభిమాని,దర్శకుడు’ వై వి ఎస్ చౌదరి’ మాట్లాడుతూ, పేదలకు ఏదైనా చేయాలని నిత్యం పరితపించేవారని, ఆయన ఎక్కడున్నా, పేదలు, రాష్ట్రం, తెలుగువారి గురించే ఆలోచించేవారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ముఖ్యంగా పౌరాణిక సినిమాల్లో తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారని వివరించారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తలుగా ‘డాక్టర్’ హనుమయ్య బండ్ల’, ‘డాక్టర్ హరినాథ్ పోలిచెర్ల’, ‘బసవేంద్ర సూపరనేని’ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక, ఈ కార్యక్రమంలో 9 ఏళ్ల బాలుడు, 11 ఏళ్ల బాలికలు స్కూల్లో అందించిన ‘ఎన్టీఆర్’పై రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టును ప్రదర్శించారు.
రాత్రి 11 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో ‘ఎన్టీఆర్’ అభిమానులు, డెట్రాయిట్ పుర ప్రముఖులంతా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ‘సురేష్ పుట్టగుంట’ సమన్వయ పరచగా, ఫహద్, సునీల్ పాంట్రా, మనోరమ గొంధి, సీత కావూరి, జో పెద్దిబోయిన, కిరణ్ దుగ్గిరాల, ఉమా, మురళి గింజిపల్లి నిర్వాహక కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.