ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం వైసీపీ, టీడీపీ నేతల మధ్య వెలుగు చూసిన ఘర్షణలు, హింస అనేక మలుపులకు దారితీస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో సీఎస్, డీజీపీలు స్వయంగా ఢిల్లీకి వెళ్లారు. ఒకవైపు.. ఈవ్యవహారం నడుస్తుండగానే.. మరోవైపు దాడులు మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇంకా పల్నాడు, తాడిపత్రి, చిత్తూరు ఏరియాలు రగులుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం మరింత ఎక్కువగా దుమారం రేపుతున్న నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు పోలిసులు ఇక్కడ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల ఇళ్లను వారు జల్లెడ పట్టారు. వైసీపీ నాయకుల ఇళ్లలో తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున నాటు బాంబులు పోలీసులకు దర్శనమిచ్చాయి. వీటిలో పెట్రోల్ బాంబులు కూడా.. గుట్టలుగుట్టలుగా కనిపించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆయా బాంబులను ఎన్నికల పోలింగ్ రోజు వినియోగించుకునేందుకే తీసుకువచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులకు ఈ బాంబులు ఎక్కడ నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం తెల్లవారు జాము నుంచి పోలీసులు రంగంలోకి దిగి.. అణువణువూ గాలించారు. గొడవకు కారణమైన నాయకులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులను గుర్తించారు.
వారు తిరిగి రావడంతోనే.?
2019 తర్వాత మాచర్లలో చెలరేగిన ఘర్షణల కారణంగా.. రెంటచింతల గ్రామానికి చెందిన సుమారు రెం డు వేల మంది ఇక్కడ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వీరంతా కూడా టీడీపీ సానుభూతిపరు లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఎన్నికల వేళ.. టీడీపీ నాయకులు వారిని దగ్గరుండి రెంట చింతలకు తీసుకువచ్చారు. పోలింగ్లో పాల్గొనేలా చేశారు. ఇది వైసీపీ నాయకులకు మంట పుట్టించిం ది. దీంతో ఇక్కడ పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ఘర్షణలు జరుగుతూనే ఉండడం గమనార్హం. అయితే.. టీడీపీ సానుభూతి పరులు రెంట చింతలకు తిరిగి వచ్చేందుకు హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ, వారికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారనే వాదన ఉంది.