గత ఏడాది మేలో అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ జాతి వివక్ష హత్యోదంతం ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 48 ఏళ్ల ఫ్లాయిడ్ మెడపై చావిన్ డెరిక్ అనే పోలీసు అధికారి 9 నిమిషాల పాటు మోకాలు నొక్కి పెట్టడంతో ఆయన మరణించారు. ట్రంప్ హయాంలో లోకల్ సెంటిమెంట్ పెరిగిపోయిందని, జాతి వివక్ష పేట్రేగిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫ్లాయిడ్ హత్యతో బ్లాక్ లైవ్ మ్యాటర్ అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.
అమెరికాలో వర్ణ వివక్షకు నిరసనగా వేలాది మంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేశారు ఈ క్రమంలోనే జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి డెరిక్ ను కోర్టు గత నెలలోనే సెకండ్ డిగ్రీ మర్డర్ సహా ఇతర నేరాల్లో దోషిగా నిర్ధారించింది. డెరెక్ కు ఉరిశిక్ష వేయాలని, 40 ఏళ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా డెరిక్ చౌవిన్కు మినియాపోలీస్ కోర్టు 22.5 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
డెరిక్ సత్ప్రవర్తనతో ఉంటే 12 ఏళ్ల తరువాత పెరోల్ ఇవ్వొచ్చని కోర్టు పేర్కొంది. గరిష్టంగా డెరిక్కు 12.5 సంవత్సరాల జైలు శిక్ష విధించాలన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. అధికార దుర్వినియోగం, ముఖ్యంగా ఈ కేసులో చూపించిన దుర్మార్గం ఆధారంగా శిక్ష విధించామని జడ్జి తెలిపారు. భావోద్వేగాలతో, సానుభూతితో ఈ తీర్పు ఇవ్వలేదని, ఫ్లాయిడ్ కుటుంబం వంటి ఎన్నో కుటుంబాల తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు అని జడ్జి పీటర్ కాహిల్ వ్యాఖ్యానించారు.