ఏపీ ప్రభుత్వ విధానాలను, జగన్ పాలనను విమర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్న సంగతి తెలిసిందే. పవన్ వైవాహిక జీవితాన్ని కూడా విమర్శిస్తున్న కొందరు వైసీపీ నేతలు….నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ ను తీవ్రస్థాయిలో విమర్శించాలని భావించిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి….తప్పులో కాలేశారు.
పవన్ ను తిట్టబోయిన నారాయణ స్వామి…పొరపాటున జగన్ ను తిట్టేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, తమ అధినేత జగన్ పై నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు నారాయణ స్వామి. అయితే, దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నారాయణ స్వామి నోరు జారారు.
పవన్ ను విమర్శించబోయిన డిప్యూటీ సీఎం…పొరపాటున జగన్ ను విమర్శించారు. ప్రజలే జగన్పై దాడి చేసే రోజులు రాబోతున్నాయని నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్ పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయని ఆయన అనడంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. పొరపాటున అన్నా…నారాయణ స్వామి నిజమే చెప్పారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగానే జగన్, వైసీపీ నేతలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు.