పెద్ద మిస్టరీగా మారింది ఏపీ ఆర్థిక పరిస్థితి. ఓపక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి బటన్లు నొక్కుతూ.. వేలాది కోట్ల రూపాయిల్ని సంక్షేమ పథకాల కింద లబ్థిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపిస్తున్న వైనం తెలిసిందే. ఇదే విషయాన్ని తాను పాల్గొన్న సభల్లో ప్రముఖుంగా ప్రస్తావిస్తారు. తన అక్కచెల్లెళ్లకు.. అన్నదమ్ములకు నేరుగా.. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్న విషయాన్ని చెప్పే ముఖ్యమంత్రి జగన్.. ఆ డబ్బుల కోసం తాను భారీగా అప్పులు చేస్తున్న విషయాన్ని ఎందుకు చెప్పరు? అన్నది ప్రశ్న.
అంతకంతకూ కుంగుతున్న ఆర్థిక పరిస్థితిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నా.. అదేమీ పట్టకుండా చేతికి అందినట్లుగా అప్పులు చేయటం అలవాటుగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఏపీకి ఎన్ని నిధులు వచ్చినా? సరిపోదా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. దీనికి కారణం.. వారం క్రితం కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి రూ.10వేల కోట్లకు పైనే భారీగా నిధుల్ని విడుదల చేసింది.
పన్నుల్లో సర్దుబాటులో భాగంగా ఏపీకి రావాల్సిన రూ.10వేల కోట్లకు పైగా భారీ మొత్తాన్ని విడుదల చేసింది. ఇంత భారీగా ఏక మొత్తంలో నిధులు విడుదలైన నేపథ్యంలో.. ఏపీ గడ్డు పరిస్థితిని అధిగమిస్తుందన్న మాట వినిపించింది.
ఇంత భారీ మొత్తం చేతికి అందిన వారం వ్యవధిలోనే మళ్లీ రూ.2వేల కోట్ల మొత్తాన్ని అప్పు చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సర రెవెన్యూ లోటుకు సంబంధించి కేంద్రం రూ.10,461 కోట్ల మొత్తాన్ని విడుదల చేసిన వారం వ్యవధిలోనే.. తాజాగా ఆర్ బీఐ (రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా) నిర్వహించిన సెక్యురిటీల వేలంలో ఏపీ సర్కారు పాల్గొంది. రూ.2వేల కోట్లను అప్పుగా తీసుకుంది. ఇందులో 11 ఏళ్ల వ్యవధికి 7.36 శాతం వడ్డీపై రూ.వెయ్యి కోట్లు.. 15 ఏళ్ల వ్యవధికి 7.3 శాతం వడ్డీకి మరో రూ.వెయ్యి కోట్లను సేకరించింది.
అంతకు ముందు వారంలోనూ రూ.2వేల కోట్లు చేసింది.
అంటే రెండు వారాల వ్యవధిలో ఏపీకి మొత్తం రూ.14వేల కోట్ల భారీ మొత్తం అందింది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉందన్న మాట ఆందోళనకు గురి చేయక మానదు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే.. గడువు తీరిన తర్వాత ఈ భారీ మొత్తాలను.. వాటికి అయ్యే వడ్డీ లెక్కలు తడిపి మోపెడు కావటం ఖాయం. మరీ అప్పులకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల మీద పడే భారం గురించి ఆలోచిస్తే.. కంటి నిండా నిద్ర కూడా పట్టే ఛాన్స్ లేదు.