చనిపోయిన తర్వాత.. మరణానికి కారణం వెతికేందుకు చేసే ఆఖరి పరీక్షగా పోస్టుమార్టం చెప్పాలి. అలాంటిది చేస్తున్న వేళ.. చనిపోయిన వ్యక్తిలో కదలిక వస్తే? ఊహే భయాన్ని కలిగిస్తుంది కదా? మరి.. అలాంటిది ఎదురైతే.. గుండె అదిరిపోవటం ఖాయం. తాజాగా ఇలాంటి భయానక ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పోస్టుమార్టం చేస్తున్న వేళలో చోటు చేసుకున్న ఉదంతం షాకింగ్ గానే కాదు.. సంచలనంగా మారింది. తర్వాతేం జరిగిందంటే..
శంకర్ అనే వ్యక్తి గత నెల 27న ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడ్ని బెలగావి ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన అతడ్ని.. బ్రెయిన్ డెడ్ గా డిక్లేర్ చేశారు. ఈ క్రమంలో అతడ్ని పోస్టుమార్టం చేసేందుకు మహాలింగాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గల్ గాలి అనే డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు శంకర్ కుటుంబీకులు అతడి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసేందుకు సర్వం సిద్ధమై.. శరీరాన్ని తాకిన వైద్యులకు షాక్ తగిలినంత పనైంది. శరీరం కదులుతున్నట్లుగా గుర్తించారు. ఒక్కసారి భయానికి గురైన వారు.. తేరుకొని మరోసారి రోగిని పరీక్షించారు. బతికి ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే.. అతడ్నిఆసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం చేయాల్సిన వైద్యుడు గల్ గాలి మాట్లాడుతూ.. తన పద్దెనిమిదేళ్ల ప్రొఫెషన్ లో దాదాపుగా 400 పోస్ట్ మార్టంలు చేశానని.. ఎప్పుడు ఇలాంటి అనుభవం తనకు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా భయంతో గుండె ఆగినంత పనైంది’ అని వైద్యుడే చెప్పారంటే.. అక్కడి సీన్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.