మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారిపోవటం తెలిసిందే. అతడి ద్వారానే.. వివేకా హత్యకు ప్లాన్ ఎలా చేశారు? ఎలా అమలు చేశారు? హత్య తర్వాతేం చేశారు? లాంటి ఎన్నో అంశాలు తెర మీదకు రావటం.. సంచలనంగా మారటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దస్తగిరి.. తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన అంశాల్ని ప్రస్తావించారు.
వివేకా హత్యకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ ప్రస్తావించని మరో కొత్త అంశాన్ని చెప్పటం ద్వారా.. రాజకీయ దుమారానికి తెర తీశారు. వివేకా మథ్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సతీమణి భారతీల హస్తం ఉందన్నారు. ఈ కారణంతోనే ఈ కేసు విచారణ ముందుకు సాగటం లేదని ఆరోపించారు. తాను చెబుతున్న విషయాలన్నీ కూడా కడప జిల్లా ప్రజలందరికి తెలుసన్నారు.
వివేకా హత్యకు ముందు తనను భాస్కర్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని.. అక్కడ అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలు ఉన్నారని.. తనతో మాట్లాడుతూ వాళ్లు చెప్పినట్లుగా చేయాలన్నారు. హత్య ప్లాన్ చెప్పారని.. దాంతో తాను వెనక్కి వచ్చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త విషయాన్ని చెప్పిన దస్తగిరి.. తనకు ఫోన్ చేసిన అవినాశ్ రెడ్డి.. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఫోన్లోకి తీసుకొని తనతో మాట్లాడించినట్లుగా చెప్పి కొత్త సంచలనానికి తెర తీశారు.
‘‘దస్తగిరీ.. మా వాళ్లు ఏం చెబితే అది చెయ్యి. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను’’ అని చెప్పారన్నారు. జగన్ తనతో మాట్లాడింది ఇదేనన్న అతడు.. అందుకే తాను ధైర్యంగా రంగంలోకి దిగినట్లుగా పేర్కొన్నారు. భారతి సూచన లేనిదే జగన్ కూడా ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదని చెప్పటం గమనార్హం. వివేకా హత్య వెనుక జగన్.. భారతి హస్తం ఉన్నందుకే సాక్ష్యాల్ని చెరిపే ప్రయత్నం చేశారని.. అందుకే కడపలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ పైనే కేసు పెట్టారని గుర్తు చేశారు.
జగన్ అండ లేకపోతే వివేకా ఇంట్లో కుక్క కూడా చనిపోదన్న దస్తగిరి.. ‘‘నాకున్న గుండె ధైర్యంతోనే ఎర్రగంగిరెడ్డి నన్ను ఎంపిక చేసుకున్నాడు. అఫ్రూవర్ గా మారే ముందు నా నిర్ణయాన్ని ఎర్రగంగిరెడ్డికి స్పష్టంగా చెప్పా. అఫ్రూవర్ గా మారితే.. నాతో పాటు జగన్ దంపతులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చా. నన్ను వేధించిన వైసీపీ నేతల్ని వదిలిపెట్టను’’ అంటూ సరికొత్త వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. తాను తప్పు చేశానని.. పశ్చాత్తాపంతో అఫ్రూవర్ గా మారినట్లు చెప్పాడు.
ఎన్ని కోట్ల రూపాయిలు డబ్బులు ఇచ్చినా తలొగ్గనన్న దస్తగిరి.. తనను నిందితుడిగా కాకుండా అఫ్రూవర్ గా ప్రజల వద్దకు ఓట్లు అడుగుతున్నట్లు చెప్పారు. తనలో నిజాయితీ ఉన్నందునే పారిపోకుండా సీఎం ఇంటి పక్కనే బతుకుతున్నట్లుగా చెప్పారు. సునీతతో తనకు ఒప్పందం ఉందన్న విషయాన్ని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న దస్తగిరి.. ‘మరి ఈ సవాల్ కు అవినాశ్ రెడ్డి సిద్ధమా? ఒకవేళ సునీతతో ఒప్పందం లేదన్నది నిరూపించలేకపోతే అవినాశ్ జైలుకు వెళ్లేందుకు సిద్ధమా?’’ అని ప్రశ్నించారు.
కడప జైల్లో తనను వైసీపీ నేతలు బెదిరించారన్న దస్తగిరి.. తన భార్యను అరెస్టు చేస్తామని వార్నింగ్ ఇచ్చారన్నారు. తనను అన్యాయంగా నాలుగు నెలల పాటు జైల్లో ఉంచారన్నారు. ఈ నెల 25న తాను నామినేషన్ వేస్తుంటే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. సీఎం జగన్ కూడా అదే రోజు నామినేషన్ వేస్తున్నారంటూ ఆంక్షలు పెట్టారన్నారు.