‘దాసి సుదర్శన్’ గా ప్రసిద్ధులైన శ్రీ సుదర్శన్ ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో పరమపదించారని చెప్పడానికి చింతిస్తున్నాం.
మిర్యాలగూడలో ప్రముఖ ఆర్టిస్ట్ గా, సాహితీవేత్తగా సురపరిచితులైన ‘దాసి సుదర్శన్’ నాగార్జునసాగర్ జూనియర్ కాలేజ్ లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ, ఎంతోమంది విద్యార్థులను కళల వైపు, సాహిత్యం వైపు మళ్లించి మంచి నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
ఆర్టిస్టుగా, సాహితీవేత్తగానే కాకుండా ఆయన జర్నలిస్టుగా కూడా వివిధ పత్రికల్లో వ్యాసాలు, వార్తలు రాస్తూ తన ప్రజ్ఞ పాటవాలను నిరంతరం ప్రకటిస్తుండేవారు.
‘దాసి సుదర్శన్’ కి సినిమా రంగంతో కూడా విస్తృతమైన అనుబంధం ఉంది.
ప్రముఖ దర్శకులు, కళాకారులు బి నర్సింగరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళాదర్శకుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
నర్సింగరావు తీసిన ‘దాసి’ సినిమాకు వచ్చిన ఐదు జాతీయ అవార్డులలో సుదర్శన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు దక్కింది.
అప్పటినుంచి ఆయనను ‘దాసి సుదర్శన్’ గా అందరూ పిలుచుకునేవారు.
ఆ తర్వాత ‘జాతీయ అవార్డుల జూరీ’ కి ఆయన సభ్యులుగా నియమితులయ్యారు.