దర్శక రత్నగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న లెజెండరీ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు గురించి సినీ ప్రేమికులకు పరిచయం అక్కర లేదు. టాలీవడ్ స్థాయిని పెంచిన దర్శకుల్లో దాసరి నారాయణరావు ఒకరు. ఇండస్ట్రీకి దాసరి చేసిన సేవలు, ఇండస్ట్రీ పెద్దగా
ఆయన వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతాయి. రాజకీయ నాయకుడిగానూ దాసరి రాణించి సత్తా చాటారు.
అయితే, అంతటి కీర్తి ప్రతిష్టలున్న దాసరి పేరుకు ఆయన తనయులు భంగం కలిగిస్తుండడం నిజంగా బాధాకరం. గతంలో, ఆస్తి పంపకాల్లో తేడా వచ్చి దాసరి కొడుకులు రోడ్డెక్కారు. ఇక, దాసరి చిన్న కొడుకు దాసరి అరుణ్ కుమార్ పేరు ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. ఓ ల్యాండ్ డీల్ లో ఒకరిని చంపేస్తానని బెదిరించిన వివాదం నుంచి అరుణ్ తేరుకోకముందే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం సేవించి కారు డ్రైవ్ చేసి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారన్న ఆరోపణలతో దాసరి అరుణ్ పై కేసు నమోదైంది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో అరుణ్ కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ 2 బైక్ లను ఢీకొట్టినట్లు కేసు నమోదైంది. అరుణ్ మద్యం తాగి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 405 పాయింట్లు రావడంతో ఆయనను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అరుణ్ పై కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.